తెలంగాణ

telangana

ETV Bharat / business

మలేరియా మందుకు అనూహ్య గిరాకీ

కరోనా బాధితుల వైద్యానికి మలేరియా కోసం వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్​ మందు మంచి ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో ఈ ఔషధానికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో అన్ని దేశాల దృష్టి క్లోరోక్విన్ ఎక్కువగా ఉండే భారత్​పై పడింది. ప్రస్తుత పరిస్థితుల్ల క్లోరోక్విన్ ఎగుమతితో మన దేశానికి ఏమైన నష్టమా.. ఫార్మా కంపెనీలు ఏమంటున్నాయి?

hydroxychloroquine demand surge
కరోనా వైద్యానికి మలేరియా మందు

By

Published : Apr 8, 2020, 7:42 AM IST

మలేరియా ముందు (హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ - హెచ్‌సీక్యూ) కోసం అమెరికాతో పాటు, బ్రెజిల్‌ తదితర దేశాల నుంచి విన్నపాలు వస్తున్నందున, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని మన ప్రభుత్వం భావిస్తోంది. కానీ దేశీయ అవసరాల మాటేమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ఔషధ రంగ ప్రతినిధులు మాత్రం.. దేశీయంగా ఇబ్బంది లేదని, ప్రపంచ వ్యాప్తంగా ఈ మందు అత్యధికంగా తయారు చేయగల సామర్థ్యం మనకు ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు. 70 శాతం ప్రపంచ అవసరాలను మనం తీర్చగలమని పేర్కొంటున్నారు.

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వచ్చిన వారికి హైడ్రాక్సి క్లోరోక్విన్‌ ఔషధాన్ని ఇస్తే కోలుకుంటున్నట్లు తెలిసి ప్రపంచ వ్యాప్తంగా ఈ ఔషధానికి గిరాకీ ఏర్పడింది. ఈ మందు తయారీ మనదేశంలోనే అధికం. అందుకే ఇప్పుడు అన్ని దేశాలు మనవైపు చూసే పరిస్థితి ఏర్పడింది. దేశీయ కంపెనీలైన ఇప్కా లేబొరేటరీస్‌, జైడస్‌ క్యాడిల్లా, సిప్లా, వాల్లేస్‌ ఫార్మాస్యూటికల్స్‌, సన్‌ ఫార్మా... తదితర కంపెనీలు హెచ్‌సీక్యూ ఔషధాన్ని పెద్దఎత్తున తయారు చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. మరిన్ని మధ్యస్థాయి ఫార్మా కంపెనీలకూ దీన్ని తయారు చేసే పరిజ్ఞానం, సదుపాయాలు ఉన్నాయి.

ప్రతి నెలా 20 కోట్ల ట్యాబ్లెట్లు..

మనదేశంలోని ఫార్మా కంపెనీలు ప్రతి నెలా 20 కోట్ల హైడ్రాక్సి క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లను (200 ఎంజీ డోసు) తయారు చేయగలవు. అవసరమైతే ఇంకా అధికంగా కూడా ఉత్పత్తి చేయొచ్చు. ఈ ఔషధాన్ని మలేరియా వ్యాధిని అదుపు చేయటానికే కాకుండా, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌తో పాటు మరికొన్ని జబ్బుల చికిత్సలో వినియోగిస్తున్నారు. ఈ మందు తయారీని అభివృద్ధి చెందిన దేశాల్లోని ఫార్మా కంపెనీలు ఎన్నో ఏళ్ల క్రితమే నిలిపివేశాయి. ఆ దేశాలు మలేరియా వ్యాధి నుంచి పూర్తిగా విముక్తం కావడం వల్ల, వినియోగం నామమాత్రంగా ఉండడమే దీనికి కారణం. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని కొన్ని అభివృద్ధి చెందుతున్న, లేదా వెనుకబడిన దేశాల్లోనే మలేరియా ప్రబలుతోంది. ఆయా దేశాలు అధికంగా మనదేశం నుంచే ఈ ఔషధాన్ని కొనుగోలు చేస్తున్నాయి. జనరిక్‌ ఔషధాల తయారీ పరిశ్రమ ఇక్కడ బాగా విస్తరించడం వల్ల దేశీయ అవసరాలతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి చేయగల సామర్థ్యం ఏర్పడటం మనకు కలిసి వస్తోంది. ఇప్పటికే ఇప్కా, జైడస్‌ క్యాడిల్లా, సిప్లా తదితర కంపెనీలకు అమెరికా నుంచి ఆర్డర్లు లభించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా 10 కోట్ల ట్యాబ్లెట్ల సరఫరాకు ఆర్డర్లు ఇచ్చింది.

చైనా నుంచి ముడిపదార్థాలు కొరత..

ఈ ఔషధాన్ని తయారు చేయడానికి అవసరమైన ముడిపదార్థాలను మనం చైనా నుంచి అధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం చైనా నుంచి ముడిపదార్థాలు సరఫరా అయ్యే పరిస్థితి లేదు. చేతిలో ఉన్న నిల్వలే ఆధారం. ఇప్పటికే కరోనా వైరస్‌ భయంతో ఎంతో మంది 10-15 ట్యాబ్లెట్ల హెచ్‌సీక్యూ స్ట్రిప్‌లను కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు, చికిత్స చేసే వైద్య సిబ్బంది ముందు జాగ్రత్తగా ఈ ఔషధాన్ని తీసుకుంటున్నారు. అందువల్ల మున్ముందు దేశీయ అవసరాలు మరీ పెరిగితే కొరత ఎదురయ్యే ప్రమాదం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని బల్క్‌ డ్రగ్స్‌, ఏపీఐ తయారీ విభాగంలోని కొన్ని దేశీయ కంపెనీలు హెచ్‌సీక్యూ ఔషధ ముడిపదార్థాలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. జైడస్‌, ఇప్కా, మంగళం డ్రగ్స్‌ వంటి కంపెనీలకు ముడిపదార్థాలు తయారు చేయగల సామర్థ్యం ఉంది.

ఇదీ చూడండి:కరోనా వ్యాక్సిన్‌ తయారీ యత్నాల్లో ఐఐఎల్​

ABOUT THE AUTHOR

...view details