Cryptocurrency In India: సామాన్యులెవరూ క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడి పెట్టవద్దని రిజర్వుబ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్ రామసుబ్రమణియమ్ గాంధీ సూచించారు. వాటి విలువల్లో వచ్చే ఆటుపోట్లతో కలిగే నష్టాలను వారు తట్టుకోలేరని ఆయన అన్నారు.
"క్రిప్టోలపై ప్రజలు సంపాదించిన ఆదాయంపై వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను విధించనున్నట్లు బడ్జెట్ ద్వారా ప్రభుత్వం ప్రకటించింది. దీని అర్థం ఈ వాణిజ్యానికి ప్రభుత్వం చట్టపరంగా ఆమోదం తెలిపినట్లే. అయితే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులకే ఇది పరిమితం. వస్తువుల కొనుగోలుకు మారకద్రవ్యంగా వాటిని వాడరాదని ప్రజలు గుర్తించాలి" అని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు ద్వారా తీసుకురాబోతున్న డిజిటల్ కరెన్సీ చాలా ఉపయోగకరమని అన్నారు. క్రిప్టోలపై వచ్చే ఆదాయాలపై పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన వివిధ అంశాలను ఆయన ఈనాడు, ఈటీవీ భారత్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
ఈ మధ్య క్రిప్టో యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రకటనను ఎలా చూడాలి?
క్రిప్టోలపై పన్ను వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం అంటే ఈ కరెన్సీ క్రయవిక్రయాలు చట్టవ్యతిరేకం కాదని అర్థం. ఈ వ్యవహారాలను ఆమోదిస్తున్నట్లు ప్రత్యక్షంగా ప్రకటించడమే. అయితే క్రిప్టో కరెన్సీల, ఆస్తుల కొనుగోళ్లు.. అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను వేసేవరకే కేంద్ర నిర్ణయం పరిమితంగా వర్తిస్తుంది. అంతేకాని క్రిప్టోను ఇతర సరకుల కొనుగోలుకు ఒక కరెన్సీగా, ఒక చెల్లింపు సాధనంగా ఉపయోగించడాన్ని ప్రభుత్వం అనుమతించలేదు. కేంద్ర నిర్ణయాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకోకూడదు. అలాగే క్రిప్టో యాప్‌ల డౌన్‌లోడ్‌లు పెరిగాయనడానికి ఆధారంగా ఎలాంటి గణాంకాలూ లేవు. ప్రభుత్వ ప్రకటన వల్ల వెంటనే పెద్ద మార్పులు వస్తాయని నేను అనుకోవడంలేదు.
తాజా పరిణామాలతో ద్రవ్యపరమైన విధానాల విషయంలో రిజర్వు బ్యాంకుకు ఉన్న విశేషాధికారాలపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు?
క్రిప్టోను వస్తువుల కొనుగోళ్లకు ఒక చెల్లింపు సాధనంగా అనుమతిస్తే దేశ ద్రవ్య సుస్థిరతపై తప్పకుండా ప్రభావం చూపుతుంది.
అప్పుడు ఉత్పన్నమయ్యే పర్యవసానాలు ఏమిటి?
ప్రధాన స్రవంతిలోని ఖాతాలతో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా వసూళ్లు, చెల్లింపులు జరిగితే దేశ ద్రవ్యవిధానాన్ని నిర్వహించడంలో కొన్ని ఇబ్బందులుంటాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో.. ద్రవ్య సరఫరాను పర్యవేక్షించడంలో రిజర్వు బ్యాంకుకు ఉండే సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుంది.
ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వచ్చాక ఆర్థికపరమైన, ద్రవ్యపరమైన స్థిరత్వాన్ని కాపాడటంలో కేంద్రానికి, ఆర్‌బీఐకి ఎరురయ్యే సమస్యలేంటి.?
చట్టపరంగా గుర్తింపు ఉందని.. దీంతో మనం ఏదైనా చేయవచ్చు అనే అపోహ ప్రజల్లోకి వెళ్తే తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి. అందుకే క్రిప్టోను ఒక మారకద్రవ్యంగా మన దేశంలో అనుమతించరాదని రిజర్వుబ్యాంకు తన అభిప్రాయాన్ని పదేపదే ప్రకటిస్తోంది.