తెలంగాణ

telangana

By

Published : Jun 14, 2020, 2:18 PM IST

ETV Bharat / business

కరోనా వేళ బంగారంపై పెట్టుబడి మంచిదేనా?

కరోనా సంక్షోభం వేళ బంగారంపై పెట్టుబడులు పెట్టడం మంచిదేనా? స్టాక్​మార్కెట్లలో అస్థిరత, డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుతున్న వేళ పసిడిపై పెట్టుబడులు సురక్షితమేనా? ఒకేసారి పెట్టుబడి పెట్టాలా? లేదా క్రమంగా చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టాలా? ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆర్థిక సలహాదారు శంకర్ చందా ఏం చెప్పారో మీరే చూడండి.

COVID adds sheen to gold: Should you invest?
కరోనా వేళ బంగారంపై పెట్టుబడులు మంచిదేనా?

కరోనా వేళ పసిడి ధరలు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి. 2020 జనవరి 1న రూ.39,850 ఉన్న 10 గ్రాముల బంగారం ధర.. జూన్​ 12 నాటికి రూ.47,110కి పెరిగింది(ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధరల ఆధారంగా). అంటే 18 శాతం కంటే అధికంగా పసిడి ధర ఎగబాకింది.

పసిడి ధరల పెరుగుదల వల్ల ప్రపంచంలో అత్యధికంగా స్వర్ణాభరణాలు కలిగిన భారతీయులు అధికంగా ప్రయోజనం పొందుతున్నారు.

సురక్షిత పెట్టుబడి..

డిపాజిట్లపై క్రమంగా వడ్డీరేట్లు తగ్గుతుండడం, స్టాక్​మార్కెట్ల అస్థిరతల నేపథ్యంలో... భారతీయ పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారంపై మదుపు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. లాక్​డౌన్​ వల్ల భౌతిక బంగారం కొనుగోళ్లు బాగా తగ్గినప్పటికీ.. ప్రస్తుతం బంగారం ఫండ్స్​పై పెట్టుబడులు పెరుగుతున్నాయి. గోల్డ్​ ఈటీఎఫ్​, డిజిటల్ కొనుగోళ్లు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లకు (ఎస్​జీబీ) కూడా మంచి ఆదరణ లభిస్తోంది.

భారతీయులకు బంగారం అంటే ఎందుకంత ఇష్టం?

భారతీయులకు బంగారం అంటే ఎందుకంత ఇష్టం?
  • బంగారాన్ని సులభంగా నగదుగా మార్చుకోవచ్చు.
  • స్వర్ణాభరణాలు అలంకరించుకుంటే సామాజిక గౌరవం లభిస్తుంది.
  • పెట్టుబడిగా చూస్తే.. స్థిరమైన మూలధన వృద్ధి లభిస్తుంది.
  • ఆర్థిక సంక్షోభ సమయంలో బంగారం అక్కరకు వస్తుంది.

సగటు పెట్టుబడిదారుడు.. భద్రత, స్థిరత్వం కోసం బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతాడు. ముఖ్యంగా సంక్షోభ సమయంలో, గందరగోళ పరిస్థితుల్లో అది అక్కరకు వస్తుందని ఆశిస్తాడు. దీనికి మంచి ఉదాహరణ.. మొత్తం ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత వచ్చినప్పుడు, లేదా వృద్ధి క్షీణత ఉన్నప్పుడు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అంటే పెట్టుబడిదారుడు కచ్చితంగా లాభపడతాడు.

కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ.. బంగారం మాత్రం మెరుపులు మెరిపిస్తోంది.

బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమేనా?

బంగారంపై పెట్టుబడులు ఎప్పుడు పెట్టాలి?

దీనికి సరైన సమాధానం లేదు. కరోనా, ఆర్థిక సంక్షోభాలు నెలకొన్న వేళ... బంగారంపై కానీ, మరే విధమైన పెట్టుబడుల విషయంలో కానీ ఇది చేయండి, ఇది చేయకండి అని చెప్పలేని పరిస్థితి.

అయితే దీర్ఘకాల పెట్టుబడులకు ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే పెట్టుబడిదారులు... సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉంటే.. ప్రస్తుతమున్న అవకాశాలను కోల్పోయే అవకాశం కూడా ఉంది. అలాకాకుండా త్వరగా ధనం సంపాదించాలనే ఆశ మాత్రం.. ఇలాంటి అస్థిర పరిస్థితుల్లో మంచిది కాదు. ఎందుకంటే పరిస్థితి అనుకూలంగా ఉంటే లాభాలు వెల్లువెత్తుతాయి. లేదంటే మొత్తం ఊడ్చుకుపోతుంది.

ఇలా చేస్తే మంచిది..

ప్రస్తుతం తారాపథంలో దూసుకుపోతున్న బంగారం ధరలను చూసి ఇది చెప్పడం లేదు. కానీ బంగారాన్ని జాగ్రత్తగా, సరైన మొత్తంలో కొనుగోలు చేయడం మంచిదే. దీనిని బాగా అర్థం చేసుకోవడానికి ఉత్తమ మార్గం గత 50 ఏళ్లలో బంగారం ధరలో వచ్చిన మార్పులను గమనించాలి.

గత యాభై ఏళ్లలో బంగారం ధరలు పెరుగుదల

1970 నుంచి 2020 వరకు బంగారం ధరలు చూసుకుంటే.. పసిడి వార్షిక వృద్ధిరేటు 11.3 శాతంగా ఉంది. ఇది చాలా మంచి రాబడి.

బంగారంపై ఎలా పెట్టుబడులు పెట్టాలి?

  • ఒకేసారి పెద్ద మొత్తంలో పసిడిపై పెట్టుబడులు పెట్టే కంటే.. మ్యూచువల్ ఫండ్స్​ సిప్​ మాదిరిగా క్రమంగా పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. ఫలితంగా మనం పెట్టే పెట్టుబడి యావరేజ్ అవుతుంది. అలాగే బంగారం నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి.
  • క్రమంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గుతుంది. పెట్టుబడిదారుడు తన లక్ష్యాన్ని చేరుకునేందుకు.. నిధుల కేటాయింపు ఎలా ఉండాలో స్పష్టత వస్తుంది.
  • క్లిష్టసమయాల్లో 5 నుంచి 15 శాతం పోర్టుఫోలియోను బంగారానికి కేటాయించడం వివేకవంతమైన వ్యూహమవుతుంది. దీని వల్ల స్టాక్​మార్కెట్లలో వచ్చిన నష్టాన్ని... పసిడి భర్తీ చేస్తుంది.
  • ప్రతి పెట్టుబడిదారులు వారి ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు, పెట్టుబడి కేటాయింపుల వ్యూహాన్ని రూపొందించుకునేందుకు... అర్హత గల మంచి ఆర్థిక సలహాదారుడ్ని సంప్రదించాలి.

(శంకర్​ చందా,సెబీ లైసెన్స్ పొందిన పెట్టుబడి సలహాదారుడు)

ముఖ్య గమనిక:

పై వ్యాసంలోని అభిప్రాయాలు అన్నీ కేవలం రచయితకు సంబంధించినవి. ఈటీవీ భారత్​ లేదా దాని మేనేజ్​మెంట్​ అభిప్రాయాలు కాదు. పై అభిప్రాయాలను పెట్టుబడి సలహాలుగా భావించకూడదు. ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ముందు అర్హత గల ఆర్థిక నిపుణులు, సలహాదారులను సంప్రదించమని పాఠకులకు ఈటీవీ భారత్ సిఫారసు చేస్తుంది.

మీకు వ్యక్తిగతంగా ఆర్థిక విషయాలకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే, నిపుణులతో సమాధానం ఇప్పించేందుకు ప్రయత్నిస్తాం. ఇందుకోసం businessdesk@etvbharat.comని సంప్రదించగలరు.

ఇదీ చూడండి:బ్యాంకుల ప్రైవేటీకరణ ఈ ఏడాది కష్టమే!

ABOUT THE AUTHOR

...view details