ప్రపంచదేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోన్న కరోనా వైరస్‌పై పోరాటంలో భారత్‌కు అన్నివిధాలా సాయం అందుతోంది. స్వదేశీయులే కాక.. ఇతర దేశాల నుంచీ ఆపన్నహస్తం అందించడానికి ముందుకు వస్తున్నారు.
చైనాకు చెందిన జాక్‌మా ఫౌండేషన్, అలీబాబా ఫౌండేషన్‌లు ఫేస్ మాస్కులు, కొవిడ్-19 టెస్టు కిట్లు వంటివి సమకూరుస్తామని తెలిపాయి. భారత్‌తో పాటు మరో 6 దేశాలకు సుమారు 17 లక్షల మాస్కులు, 1,65,000 కొవిడ్-19 పరీక్షా కిట్లు సమకూరుస్తున్నాయి. రక్షణ దుస్తులు, వెంటిలేటర్లు, థర్మామీటర్లు కూడా సరఫరా చేయనున్నట్లు ప్రకటించాయి. తొలి విడతగా గత శనివారం ఈ సంస్థ నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైద్య పరికరాలను అందుకుంది.
60 కోట్లు: కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ కలిపి రూ.60 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. పీఎమ్ కేర్స్ నిధికి బ్యాంకు తరఫున రూ.25 కోట్లు, వ్యక్తిగతంగా మరో రూ.25 కోట్లు అందించనున్నట్లు ఉదయ్ ట్వీట్ చేశారు. మరో రూ.10 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకు తరఫున అందించనున్నట్లు ప్రకటించారు.
కల్యాణ్ జువెలర్స్:సమాజంలోని బలహీన వర్గాలకు ఆహారంతో పాటు నిత్యావసరాలు అందించడం కోసం రూ.10 కోట్లు కేటాయించినట్లు కల్యాణ్ జువెలర్స్ ప్రకటించింది. ఇందుకోసం స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని తెలిపింది.
3 రెట్ల అధిక వేతనం:ఎమ్‌సీఎక్స్ కార్యాలయానికి వచ్చి పని చేసేందుకు ఎంపిక చేసిన ఉద్యోగులకు ఈ సంక్షోభ సమయంలో 3 రెట్ల వరకు అధిక వేతనం ఇవ్వనున్నట్లు అతిపెద్ద కమొడిటీస్ ఎక్స్ఛేంజీ ఎంసీఎక్స్ వెల్లడించింది. వారు కార్యాలయంలోనే ఉండేలా ఏర్పాట్లు కూడా చేసింది.