కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న సుమారు 22.12 లక్షల మంది వైద్యులు, ఇతర సిబ్బందికి రూ.50 లక్షల విలువైన బీమా కల్పిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 26న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద వారందరికి బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది.
" ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ప్రకటించిన నియమాల ప్రకారం కొవిడ్-19ను అరికట్టేందుకు కృషి చేస్తున్న వారికి బీమా కల్పించే పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ విభాగాల్లోని వైద్య సిబ్బందితో పాటు ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది, పదవీ విరమణ పొందిన సిబ్బంది, వలంటీర్లు, కాంట్రాక్టు వర్కర్లు, రోజువారి కూలీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య సంస్థల్లోని ఔట్సోర్సింగ్ సిబ్బందికీ ఈ పథకం వర్తిస్తుంది."
- కేంద్ర ఆరోగ్య శాఖ.