ఒక మోస్తరు నుంచి మధ్య స్థాయి కొవిడ్-19 చికిత్సలో వినియోగిస్తున్న 'ఫావిపిరవిర్' ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ తయారు చేసింది. ఫావిపిరవిర్ ఔషధాన్ని పూర్తిగా సొంత పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినట్లు, ఈ ఔషధం ఏపీఐ (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రేడియంట్)ని ఇతర దేశాలకు ఇప్పటికే ఎగుమతి చేయటం ప్రారంభించినట్లు బయోఫోర్ సీఈఓ డాక్టర్ జగదీశ్‌బాబు రంగిశెట్టి వెల్లడించారు. ఫావిపిరవిర్ ట్యాబ్లెట్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేయటానికి వీలుగా డీసీజీఐ (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) వద్ద దరఖాస్తు చేశామని, అనుమతి రాగానే విడుదల చేస్తామని తెలిపారు. 'ఫాస్ట్ ట్రాక్ రివ్యూ' పద్థతిలో తమ దరఖాస్తును డీసీజీఐ పరిశీలిస్తున్నట్లు, త్వరలో అనుమతి రాగలదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరలోనే ఫావిపిరవిర్ ట్యాబ్లెట్‌ను విడుదల చేయాలని తాము భావిస్తున్నట్లు వివరించారు జగదీశ్‌బాబు. ఈ ఔషధాన్ని ఇంటర్మీడియేట్ స్టేజ్ నుంచి ఏపీఐ వరకూ హైదరాబాద్ సమీపంలోని తమ ఫార్ములేషన్ ప్లాంటులోనే సొంతంగా తయారు చేస్తామని ఆయన వెల్లడించారు.