తెలంగాణ

telangana

ETV Bharat / business

లాక్​డౌన్​ను పొడిగించిన వేళ ఆర్థిక ఉద్దీపన ఏదీ? - Covid-19

దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోన్న తరుణంలో లాక్​డౌన్​ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద మోదీ ప్రకటన చేశారు. వైరస్​ ధాటికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ఎక్కడికక్కడ వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో స్తబ్ధత నెలకొనడం వల్ల 86 లక్షల కోట్ల డాలర్ల ప్రపంచ జీడీపీపై తీవ్ర ప్రభావం పడి ఆర్థిక సంక్షోభానికి దారితీస్తోంది. మహమ్మారి కారణంగా దేశార్థిక ముఖచిత్రం ఛిద్రం కాకుండా కాచుకొనేలా పరిణత వ్యూహాల్ని కేంద్రం పట్టాలకెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Covid-19: All eyes on stimulus package as PM Modi extends lockdown till 3 May
లాక్​డౌన్​ను పొడిగించిన వేళ ఆర్థిక ఉద్దీపన ఏదీ?

By

Published : Apr 15, 2020, 8:22 AM IST

స్వైన్‌ఫ్లూ కంటే పదింతలు ప్రాణాంతకమైన కరోనా మహమ్మారిపై భారతావని పోరు నిర్ణయాత్మక దశకు చేరింది. మానవాళి చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 130 కోట్ల జనావళిని మూడు వారాలపాటు గృహనిర్బంధంలో ఉంచిన ఇండియా- లాక్‌డౌన్‌ కాలావధిని మరో 19 రోజులు పొడిగించింది. నేటినుంచి వారం రోజులపాటు దేశానికి అగ్నిపరీక్షేనని, కరోనా వ్యాప్తి చెందకుండా కాచుకొనే ప్రాంతాల్లో షరతులకు లోబడి నిత్యావసర కార్యకలాపాలకు అనుమతిస్తామని ప్రధాని మోదీ ప్రకటన చాటుతోంది. గత నెల 24న లాక్‌డౌన్‌ ప్రకటించే నాటికి 523గా ఉన్న కరోనా కేసుల సంఖ్య నేడు 11 వేలకు చేరింది. ముంచుకొస్తున్న ముప్పు తీవ్రత గుర్తించి ముందుగానే లాక్‌డౌన్‌ ప్రకటించబట్టి సరిపోయిందిగాని, లేకుంటే ఎనిమిది లక్షల 20 వేల కరోనా కేసులతో ఇండియా పెను సంక్షోభంలో కూరుకుపోయేదని కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది.

కేరళలో కరోనా ఉరవడి నెమ్మదించిందని, శుక్రవారంనాటికి కొత్త కేసులు రాకుంటే వైరస్‌ నుంచి గోవా విముక్తమైనట్లేనన్న సమాచారం ఆశావహంగా ఉన్నా- మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ విష గొలుసును తెగతెంచే కృతనిశ్చయంతో ప్రజ్వలన కేంద్రాల(హాట్‌స్పాట్స్‌)ను రెడ్‌జోన్లుగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వాలు అక్షరాలా పెనుయుద్ధమే చేస్తున్నాయి. ప్రధానితో వీడియో భేటీ సందర్భంగా లాక్‌డౌన్‌ పొడిగించాలనే కోరిన మెజారిటీ రాష్ట్రాలు- చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభాన్నీ గట్టిగానే ఏకరువు పెట్టాయి. ప్రజల జీవనంతోపాటు జీవనాధారంపైనా దృష్టి సారించాల్సిందేనన్న ప్రధాని మోదీ మీద- కురుక్షేత్రంలో కర్ణుడి రథ చక్రంలా కుంగిన దేశార్థిక వ్యవస్థలోని అన్ని విభాగాల్నీ పునరుజ్జీవింప చేయాల్సిన బృహత్తర బాధ్యత ఉంది!

తొమ్మిది దశాబ్దాలనాటి మహా మాంద్యాన్ని గుర్తుకు తెచ్చేలా- కరోనా ధాటికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ఎక్కడికక్కడ వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో స్తబ్ధత ఆవరించడంతో 86 లక్షల కోట్ల డాలర్ల ప్రపంచ జీడీపీపై తీవ్ర ప్రభావం పడి ఆర్థిక సంక్షోభం ముమ్మరిస్తోంది. పరిశ్రమలు మూతపడి, నిరుద్యోగిత పెచ్చరిల్లి, పేదసాదల బతుకు దుర్భరమవుతున్న దశలో ఆర్థిక పునరుజ్జీవమే లక్ష్యంగా ప్రపంచ దేశాలు 12 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన పథకాల్ని ప్రారంభించాయి. నిరుపేదలకు ఆసరాగా లక్షా 70 వేలకోట్ల రూపాయల ప్యాకేజీని మోదీ ప్రభుత్వం ప్రకటించినా, అది భారత స్థూల దేశీయోత్పత్తిలో 0.8శాతం! మూడు వారాల లాక్‌డౌన్‌ కారణంగా దేశానికి వాటిల్లిన దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం- సకల పరిశ్రమల దురవస్థకు నిలువుటద్దం! స్థిరాస్తి రంగం ఏకంగా లక్ష కోట్ల రూపాయలు నష్టపోయిందని జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి చెబుతోంది. కరోనా దెబ్బకు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు దారుణంగా దెబ్బతిన్నాయన్నది కేంద్రమంత్రి గడ్కరీ చెప్పిన మాటే.

రాబడి కుంగిన రాష్ట్ర ప్రభుత్వాలే ఉద్యోగుల జీతనాతాల్లో కోతలు విధిస్తుంటే, నష్టాల ఊబిలో చిక్కుకొన్న ప్రైవేటు సంస్థలు సిబ్బంది భారాన్ని ఎలా నిభాయించగలవన్నది మౌలిక ప్రశ్న! దేశవ్యాప్తంగాగల సంస్థల్లో 87శాతం అసంఘటిత రంగంలోనే ఉన్నాయి. మొత్తం శ్రామిక శక్తిలో 90 శాతానికి అవే ఉపాధి ఆలంబనగా నిలుస్తున్నాయి. వాటి మనుగడే ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో- కోట్లాది శ్రామికుల ఉపాధి విషయంలో ఏం చేయాలో కేంద్రమే ఆలోచించాలి. రబీ కోతల వేళ దాపురించిన కరోనా- అటు రైతుల పొట్టగొట్టి, ఇటు జాతి ఆహార భద్రతకూ తూట్లు పొడిచే ప్రమాదం ఉంది. ఆయా రంగాలవారీగా ‘ఫిక్కీ’ సహా వాణిజ్య సంస్థలు, పలువురు ఆర్థికవేత్తలు చేసిన సూచనల్ని తర్కించి మేలైన తరుణోపాయాల్ని తక్షణం అమలు చేయాలి. కరోనా కారణంగా దేశార్థిక ముఖచిత్రం ఛిద్రం కాకుండా కాచుకొనేలా పరిణత వ్యూహాల్ని కేంద్రం పట్టాలకెక్కించాలి!

ABOUT THE AUTHOR

...view details