Covaxin: మనదేశానికి చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన కొవిడ్-19 టీకా, 'కొవాగ్జిన్'కు అనుమతి ఇచ్చే అంశాన్ని అమెరికా ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ఎఫ్‌డీఏ) పరిశీలించనుంది. 'క్లినికల్ హోల్డ్' పేరిట ఈ టీకాను ఇప్పటి వరకూ యూఎస్‌ఎఫ్‌డీఏ పరిగణనలోకి తీసుకోలేదు. ఇటీవలే దీనికి 'క్లినికల్ హోల్డ్' పరిమితిని ఎత్తివేసింది. తద్వారా 'కొవాగ్జిన్' టీకాపై పరిశీలన మొదలుపెట్టినట్లు అవుతోందని యూఎస్‌లోని భారత్ బయోటెక్ భాగస్వామ్య సంస్థ అక్యుజెన్ ఇంక్. వెల్లడించింది.
అమెరికా ఔషధ నియంత్రణ మండలి పరిశీలనలో 'కొవాగ్జిన్' టీకా - Covaxin
Covaxin: భారత్ బయోటెక్ కొవిడ్ టీకా 'కొవాగ్జిన్'కు అనుమతి ఇచ్చే అంశాన్ని అమెరికా ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ఎఫ్‌డీఏ) పరిశీలించనుంది. ఈ మేరకు దానిపై ఉన్న 'క్లినికల్ హోల్డ్' పరిమితిని ఎత్తివేసింది.
'కొవాగ్జిన్'కు యూఎస్‌లో అనుమతులు తీసుకొని విక్రయించే బాధ్యతలను ఆక్యుజెన్ ఇంక్. చేపట్టిన విషయం విదితమే. దీనికి అనుగుణంగా అనుమతి కోసం కొంతకాలం క్రితం ఎఫ్‌డీఏను ఆక్యుజెన్ ఇంక్. సంప్రదించింది. ఎఫ్‌డీఏ తాజా నిర్ణయంతో యూఎస్‌లో ప్రజలకు మరొక టీకా ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడినట్లు ఆక్యుజెన్ ఇంక్. సీఈఓ డాక్టర్ శంకర్ ముసునూరి పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని తట్టుకోవాలంటే ఒక టీకాతో సాధ్యం కాదని, రెండు- మూడు రకాలైన పరిష్కారమార్గాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల మార్కెట్ విక్రయానికి డీసీజీఐ అనుమతి