తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా ఎఫెక్ట్​: భారత్​లో ధరలు పెరిగే వస్తువులు ఇవే! - కరోనా వైరస్

ప్రపంచానికే హార్డ్​వేర్ రాజధాని చైనా. చాలా దేశాల్లో కంపెనీలకు ముడిసరుకులకు ఆధారం ఆ దేశమే. అలాంటి చైనాలో ఇప్పటికే 2వేల మందికిపైగా బలితీసుకుంది కరోనా వైరస్​. కొవిడ్​-19 ప్రభావంతో ఆ దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు పడిపోయాయి. ఈ ప్రభావం అనేక దేశాల్లో వివిధ రంగాలపై పడుతోంది. భారత్​లో ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ధరల పెరుగుదల తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే... ఏఏ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది?

corona
కరోనా

By

Published : Feb 22, 2020, 6:49 AM IST

Updated : Mar 2, 2020, 3:38 AM IST

కరోనా ఎఫెక్ట్​: భారత్​లో ధరలు పెరిగే వస్తువులు ఇవే!

కరోనా వైరస్​..ప్రపంచానికి ముడిసరుకులు అందించే చైనాను వణికిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అక్కడ నూతన సంవత్సరం సెలవులను పొడగించారు. ఫలితంగా కర్మాగారాలు మూతపడ్డాయి. ఇటీవల కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించినప్పటికీ పూర్తి సామర్థ్యంతో పనిచేయట్లేదు.

చైనాలో ఉత్పత్తి నిలిచిపోవటం వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బతింటోంది. కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న హుబే రాష్ట్రంలోనే పలు దిగ్గజ సంస్థలకు ఉత్పత్తి కేంద్రాలున్నాయి.

భారత దిగుమతులు 484 బిలియన్​ డాలర్లు కాగా అందులో 18 శాతం అంటే 85 బిలియన్​ డాలర్లు విలువైన ఉత్పత్తులు చైనా నుంచే వస్తున్నాయి.

ఎలక్ట్రానిక్ ఉపకరణాలు

భారత ఎలక్ట్రానిక్ మార్కెట్ విలువ రూ.5.3 లక్షల కోట్లు. ఇందులో 6 శాతం ఎగుమతులు, 31 శాతం దిగుమతులు ఉన్నాయి. దిగుమతుల్లో చైనా వాటా 67 శాతం.

భారత్ కూడా విడిభాగాలు, ముడిసరుకుల దిగుమతులకు చైనాపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. టీవీలు, రిఫ్రిజరేటర్లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు సంబంధించి భారత మార్కెట్ రూ.76 వేల కోట్లు. ఇందులో చైనా వాటా 45 శాతం చైనా. ఫలితంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది.

వేసవి కాలం దృష్ట్యా ఏసీ తదితర వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉండనుంది. ప్రస్తుతానికి కావాల్సినన్ని విడిభాగాలు, ముడిసరుకులు కంపెనీల వద్ద ఉన్నాయని, ఈ కారణంగా ధరలపై వెంటనే ప్రభావం పడదని క్రిసిల్ తెలిపింది. కానీ.. మార్చి చివరి వరకు ధరల పెరుగుదల తప్పదని పేర్కొంది.

టీవీలు, కంప్యూటర్లు

టీవీల తయారీలో వాడే పరికరాల్లో 75 శాతం, మొబైల్ ఫోన్ల తయారీలో కోసం ఉపయోగించే వాటిలో 85 శాతం చైనా నుంచే భారత్​ దిగుమతి చేసుకుంటోందని అంచనా. మొబైల్ డిస్​ప్లేలు, టీవీ ప్యానళ్లు, సర్క్యూట్ బోర్డులు, మెమొరీ ఎల్ఈడీ చిప్​లకు చైనానే ఆధారం.

ఏసీల్లో ఉపయోగించే కంప్రెసర్లు, వాషింగ్ మెషిన్లలో ఉపయోగించే మోటార్లు కూడా ఎక్కువగా చైనా నుంచే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చైనా నుంచి సరఫరా నిలిచి పోవటం వల్ల వీటి ధరలు పెరగనున్నాయని వారు అంచనా వేస్తున్నారు.

ప్రపంచంలో 90 శాతం కంప్యూటర్లు చైనాలోనే తయారవుతున్నాయన్నది మరో అంచనా. ప్రస్తుత ఉత్పత్తి నిలుపుదలతో వాటి ధరలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

మొబైల్​ ఫోన్లు..

చైనా.. అనేక మొబైల్​ కంపెనీలకు కేంద్రం. యాపిల్​ వంటి దిగ్గజ సంస్థలకూ అక్కడే ప్రధాన తయారీ యూనిట్లు ఉన్నాయి. అవీ వైరస్​ వ్యాప్తి చెందిన హుబే రాష్ట్రానికి దగ్గరలోనే. ఈ కారణంగా ఈ ఏడాది ఆదాయం అంచనాలను అందుకోలేమని యాపిల్​ సంస్థే ప్రకటించింది.

"భారత్​ నుంచి చైనాకు ఎవరూ వెళ్లడం లేదు, రావటం లేదు. వైరస్ వ్యాప్తి చెందుతున్న భయంతో అక్కడి ఫోన్లను కొనేందుకూ భయపడుతున్నారు. ప్రస్తుతం మొబైల్​ ధరలు 5-10శాతం పెరిగాయి. ఇది ఇలాగే కొనసాగితే మరింత పెరిగే అవకాశం ఉంది."

-మొబైల్ స్టోర్​ యజమాని, కాన్పుర్​

ఎల్ఈడీ బల్బులు...

ఎల్​ఈడీ బల్బులకు సంబంధించి 30 శాతం విడిభాగాలు చైనా నుంచే దిగుమతి అవుతాయి. ఫలితంగా 10 శాతం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు విద్యుత్​ దీపాలు, విడిభాగాల తయారీదారుల సమాఖ్య అధ్యక్షులు సుమత్ పద్మాకర్​ తెలిపారు.

కరోనా వైరస్​ ప్రారంభ దశ జనవరిలో నెలకు సరిపడా ముడిసరుకు తమ వద్ద ఉందని తెలిపారు సుమత్​. త్వరగానే పరిస్థితులు అదుపులోకి వస్తాయని భావించామన్నారు. కానీ ప్రస్తుతం మరింత జటిలం కావటం వల్ల ముడిసరుకు అందుబాటులో లేదన్నారు. ఈ ప్రభావం మార్చిలో కనబడుతుందని వివరించారు సుమత్.

ఔషధ రంగంలోనూ...

దేశీయంగా ఔషధ పరిశ్రమ.. దిగుమతులపై ఎక్కువగానే ఆధారపడి ఉంది. మరో రెండు నెలలవరకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. ఏప్రిల్​లో దిగుమతుల పునరుద్ధరణ జరగకపోతే ఫార్మా పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుందని విశ్లేషకుల అంచనా.

మందుల తయారీలో ప్రధానంగా వాడే బల్క్​ డ్రగ్​లు​ 69 శాతం చైనా నుంచే వస్తున్నాయి. కొన్ని యాక్టివ్​ ఫార్మాసుటికల్స్​ ఇన్​గ్రేడియంట్లు(ఏపీఐ) 80 నుంచి 90 శాతం దిగుమతుల ద్వారానే వస్తున్నాయని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది.

మన దేశానికి దిగుమతవుతోన్న మొత్తం ఏపీఐ, ఇంటర్మీడియటరీలలో 65 నుంచి 70 శాతం చైనా నుంచే వస్తున్నట్లు వెల్లడించింది ఇక్రా. కొన్నింటికి మాత్రం చైనానే పూర్తి ఆధారమని, వీటి విషయంలో మరింత సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొంది. మొత్తం మీద ఫార్మా పరిశ్రమ రేటింగ్​ను తగ్గించింది.

ప్లాస్టిక్​...

ప్లాస్టిక్ పరిశ్రమలో చైనా ప్రమేయం తక్కువగా ఉన్నప్పటికీ... తక్కువ ధరల్లో లభించేవి మాత్రం అక్కడినుంచే దిగుమతి అవుతున్నాయని నిపుణలు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో డిమాండ్​ ఉండే వీటి ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఇతరాలు..

చైనా నుంచి బొమ్మలు, పాదరక్షలు, గృహోపకరణాలు, వస్త్రాలు భారీగానే భారత్​కు దిగుమతి అవుతాయి. వీటిపైనా కరోనా ప్రభావం పడే అవకాశం ఉంటుందని అంచనా. బంగారం ధర పెరుగుతూనే ఉంది. డిమాండ్ పడిపోతుందన్న అంచనాల మధ్య ముడిచమురు ధర తగ్గుతోంది. ఇది ప్రజలకు మేలు చేసే విషయమే.

దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోన్న భారత్​లో ఈ పరిణామం ద్వారా పరిస్థితి మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. దేశీయంగా కంపెనీలు పోటీని తట్టుకునేలా తయారవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరిగినప్పటికీ కరోనాకు పరిష్కారం లభించినట్లయితే మళ్లీ తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Last Updated : Mar 2, 2020, 3:38 AM IST

ABOUT THE AUTHOR

...view details