తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా తెచ్చిన మార్పు.. పంథా మార్చుకుంటున్న అంకురాలు - corona impact on small business

మనిషి జీవితంలో పాటు చాలా విషయాల్లో కరోనా మార్పులు తీసుకొచ్చింది. దేశంలో నవకల్పనలకు, ఆర్థిక ప్రగతికి, ఉద్యోగాల కల్పనకు కీలకమైన అంకురాల విషయంలోనూ అదే జరిగింది. వీటి పరిస్థితి కరోనా కంటే ముందు ఒకలా ఉండగా.. ఇప్పుడు పూర్తి భిన్నంగా మారిపోయింది. వ్యాపార పంథా మార్చుకోవటం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవటం వంటి వాటితో లాభాల వైపు పయనించే ప్రయత్నం చేస్తున్నాయి.

corona impact on startup companies
కరోనా తెచ్చిన మార్పు.. పంథా మార్చుకుంటున్న అంకురాలు

By

Published : Aug 9, 2020, 8:00 AM IST

కరోనా కారణంగా చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. లాభాల సంగతి దేవుడెరుగు.. వ్యాపారం కొనసాగితే చాలు అనే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా కంపెనీలు కొవిడ్‌ వల్ల ఉత్పన్నమైన అవకాశాలను అందిపుచ్చుకొని లాభాల వైపు పయనిస్తున్నాయి. దేశ ప్రగతికి, నవకల్పనలకు కీలకమైన అంకురాలు కూడా తమ వ్యాపార పంథా మార్చుకుంటున్నాయి.

ఫిక్కీ సంస్థ.. ఇండియా ఏంజెల్‌ నెట్‌వర్క్‌తో అంకురాల గురించి చేసిన అధ్యయనంలో.. 70 శాతం అంకుర పరిశ్రమలు కొవిడ్‌ వల్ల ప్రభావితం కాగా, 12 శాతం పూర్తిగా మూతపడ్డట్లు వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం.. 60 శాతం అంకురాలు పడుతూ లేస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. మూడో వంతు పరిశ్రమలకు రావాల్సిన పెట్టుబడులు నిలిచిపోయాయి. 10 శాతం పెట్టుబడుల ఒప్పందాలు రద్దయ్యాయి.

పంథాను మార్చుకొని ….

జొమాటో… దగ్గర్లోని హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని ఇంటివద్దకు డెలివరీ చేసే అంకురం. కరోనా వల్ల ప్రజలు బయటి భోజనం తినటం చాలా తగ్గించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆ సంస్థ మద్యం‌ డెలివరీలోకి ప్రవేశించింది. ప్రస్తుతం చాలా అంకురాలు ఇలానే వ్యాపారాన్ని మార్చుకోవటం, కొవిడ్‌ వల్ల ఉత్పన్నమైన అవకాశాలను అందిపుచ్చుకోవటం చేస్తున్నాయి.

బెంగళూరుకు చెందిన క్లోవర్‌ అనే అంకురం గ్రీన్‌ హౌస్‌లో పంటలు పండించి హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తుంది. కరోనా మూలంగా రెస్టారెంట్లకు అందించడం వీలుకాకపోవటం వల్ల ప్రత్యక్షంగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. దీనికోసం డెలివరీ సంస్థతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ కార్యకలాపాలను విస్తరించారు.

దిల్లీలో ఎలక్ట్రిక్‌ బైక్‌లను అద్దెకిచ్చేది జిప్‌ అనే అంకురం. లాక్‌డౌన్‌తో వాహనాలన్నీ గ్యారేజ్‌కే పరిమితమయ్యాయి. ప్రజలు నిత్యావసరాలు కొనుక్కోవడానికి బయటికి రాలేరు కాబట్టి వాటిని ఇంటికి సరఫరా చేయడానికి తమ వాహనాలను వాడుకోవచ్చని నిర్ణయించింది. కిరాణా, సూపర్‌ మార్కెట్లతో ఒప్పందం చేసుకొని డెలివరీ బాయ్‌లను నియమించుకుని సరుకుల డోర్‌ డెలివరీ మొదలుపెట్టింది. ఆ వ్యాపారం లాభసాటిగా సాగుతోంది.

ఇవే కాక చాలా అంకురాలు ఇలానే వ్యాపార పంథాను మార్చుకున్నాయి. చిన్న అంకురాలే కాకుండా పెద్ద కంపెనీలు కూడా పంథాను మార్చుకుంటున్నాయి. టైర్ల తయారీలో ఉన్న సియట్‌ కంపెనీ.. పీపీఈ కిట్లను రూపొందిస్తోంది. బయట నుంచి కొనుగోలు చేసిన కూరగాయలు, పండ్లు శుభ్రం చేయడానికి 'నీమ్‌ వాష్' అనే ద్రావణాన్ని ఐటీసీ మార్కెట్లోకి తెచ్చింది.

మారిపోయిన ప్రాధాన్యాలు..

కరోనా వల్ల పెట్టుబడులు పెట్టే సంస్థల ప్రాధాన్యాలు మారిపోయాయి. ఆరోగ్యం, విద్య, కృత్రిమ మేధ, ఫిన్‌టెక్‌, అగ్రి సంస్థల ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గే అవకాశాలు తక్కువ. కాబట్టి వీటికి సంబంధించిన వాటిలోనే పెట్టుబడికి మొగ్గుచూపుతున్నాయి. నాస్కామ్‌ ప్రకారం.. 40 శాతం వరకు సాంకేతికతకు సంబంధించిన అంకురాలు తాత్కాలికంగా కార్యకలాపాలు ఆపేయటం కానీ, మూసివేతకు దగ్గరలో కానీ ఉన్నాయి. 54 శాతం మాత్రం తమ దిశను మార్చుకుని పనిచేస్తున్నాయి.

చాలా అంకురాలు ఖర్చును తగ్గించుకొని కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. మరో మూడు నెలల్లో పరిస్థితి చక్కదిద్దుకోకుంటే ఈ రంగంలో మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది.

మూడో స్థానం..

అంకురాల్లో చైనా, అమెరికా తర్వాత భారత్​ మూడో స్థానంలో ఉంది . 2008లో దేశంలో దాదాపు 7వేల అంకురాలు ఉండగా… 15 శాతం వార్షిక వృద్ధితో 2019 నాటికి 50వేల అంకురాలు ఏర్పాటయ్యాయి. 2 లక్షల మంది అంకురాల్లో పనిచేస్తున్నారని అంచనా.

ప్రభుత్వ సహాయం...

కొవిడ్‌ నేపథ్యంలో అంకురాల కోసం పలు పథకాలను తీసుకొచ్చింది ప్రభుత్వం. విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా దేశీయ యాప్‌ల రూపకల్పనలో పోటీ పెట్టింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన పలు అంకురాలు కూడా ప్రతిభకనబరిచి అవార్డులు గెలుచుకున్నాయి. కొవిడ్‌-19 సమయంలో కష్టాల్లో కూరుకుపోయిన అంకురాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. చైనా యాప్‌ల నిషేధమూ దేశీయ అంకురాలకు కొత్త అవకాశాలను తెచ్చింది.

ఇదీ చూడండి: మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా?

ABOUT THE AUTHOR

...view details