తెలంగాణ

telangana

ETV Bharat / business

క్లెయింలో చిక్కులను పరిష్కరించుకోండిలా.. - issues

కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో జీవిత బీమా తీసుకోవడం ఇప్పుడు చాలా మంది అనుసరిస్తున్న ఆర్థిక సూత్రం. చాలా మంచి పరిణామనే చెప్పాలి. బీమా తీసుకోవడం ఎంత ముఖ్యమో.. క్లెయిమ్​ చేసుకోవడం అంతే ముఖ్యం. ఈ సమయంలో కొన్ని సందర్భాల్లో సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమస్యలు, వాటి పరిష్కారాలు మీకోసం.

క్లెయింలో చిక్కులకు పరిష్కరించుకోండిలా..

By

Published : Aug 22, 2019, 5:31 AM IST

Updated : Sep 27, 2019, 8:25 PM IST

ప్రస్తుత సమయాల్లో ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు. అనుకోకుండా కుటుంబ పెద్ద ఏదైన ప్రమాదం బారిన పడితే ఆ కుటుంబం పరిస్థితులు ఒక్క సారిగా మారిపోతాయి. పిల్లల చదువులు, భవిష్యత్​ అవసరాలకు పొదుపు మదుపులు లేకపోవడం.. అవసరాలు తీరేంత సంపద సృష్టించుకోలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి వాటిని నివారించేందుకు ఉన్న ఉత్తమ ఆర్థిక ప్రణాళికే..జీవిత బీమా.

అయితే బీమా తీసుకోవడమే కాదు.. క్లెయిం​ చేసుకోవడమూ తెలియాలి. సాధారణంగా బీమా క్లెయిమ్​ సమయంలో తలెత్తే సమస్యలు.. వాటిని పరిష్కరించుకునేందుకు ఉన్న మార్గాలు తెలుసుకుందాం పదండి.

వివరాల్లో తప్పులుంటే...

పాలసీదారుడికి అనుకోకుండా ఏదైనా జరిగితే.. అప్పుడు ఆ కుటుంబ సభ్యులు అతని పాలసీని క్లెయిమ్​ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు పొరపాట్లు తలెత్తొచ్చు. బీమా పత్రాల్లో, మరణ ధ్రువీకరణ పత్రాల్లో ఉన్న వివరాలు సరిపోలక పోవచ్చు. అలాంటి సందర్భాల్లో వివరాలు సరిచూసుకునేందుకు చట్టపరంగా అనుమతులు అవసరమవుతాయి. నోటరీ ధ్రువపత్రాలు కొన్ని సార్లు సరిపోతాయి.

ఇలాంటి సమస్యకు చెక్​పెట్టేందుకు పాలసీ తీసుకునేటప్పుడే.. నామినీ పేరును పాలసీలో పేర్కొనాలి. దీని ద్వారా క్లెయిమ్​ సందర్భాల్లో వచ్చే ఇబ్బందులు చాలా వరకు తగ్గించుకోవచ్చు.

మన భారతీయ కుటుంబాల్లో ఒక వ్యక్తి తన మరణం గురించి మాట్లాడటం చెడుగా పరిగణిస్తారు. అందుకే చాలామంది "నాకేమైనా జరిగితే" అని అనడానికి సందేహిస్తారు. కానీ జీవిత బీమా పాలసీల లక్ష్యం తన కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడం. కాబట్టి, ప్రతి వ్యక్తీ తాను పాలసీ తీసుకోగానే.. నామినీగా ఎవరి పేరును నమోదు చేశారనే వివరాలను తెలియజేయాలి. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే.. బీమా సంస్థను సంప్రదించి, మార్పులు చేర్పులు చేసుకోవాలి. అప్పుడే నిజమైన వారసులకు బీమా పరిహారం అందే వీలుంటుంది.

పాలసీదారు కనిపించకుండాపోతే...

ఎవరైన వ్యక్తి పాలసీదారు కొన్నేళ్ల పాటు కనిపించకుండా పోతే.. వారిపై పాలసీని క్లెయిమ్​ చేసుకోవచ్చా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇలాంటి సందేహాలకు మన చట్టాల్లో స్పష్టమైన వివరణ ఉంది. కనిపించకుండా పోయిన వ్యక్తికి సంబంధించిన పాలసీని క్లెయిమ్​ చేసుకోవచ్చని ఈ చట్టాలు చెబుతున్నాయి.
ఈ చట్టం ప్రకారం.. ఎవరైన వ్యక్తి ఏడేళ్లపాటు ఎలాంటి సమాచారం లేకుండా కనిపించకుండా వెళ్తే.. అతను మరణించినట్లే భావించొచ్చు. అంటే ఒక వ్యక్తి ఏ సమాచారం లేకుండా ఏడేళ్లపాటు కనిపించకపోతే.. అతనికి సంబంధించిన బీమా పాలసీలను క్లెయిమ్​ చేసుకోవచ్చు. అతని కుటుంబ సభ్యులు తప్పిపోయిన వ్యక్తిని కనుక్కోవడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేసినట్లు రుజువులు సమర్పించాలి. పోలీసులకు ఫిర్యాదు చేయడం, కోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకోవడం లాంటివి ఈ ప్రయత్నాల కిందకు వస్తాయి. ముఖ్యంగా ఆ వ్యక్తికి సంబంధించిన జాడ లేదని చట్టపరంగా రుజువయ్యేంత వరకు పాలసీ ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి.

విదేశాల్లో ప్రమాదానికి గురైతే..

ఉద్యోగం, వ్యాపారాల నిమిత్తం చాలా మంది ప్రపంచంలోని ఎన్నో దేశాలకు తిరుగుతున్నారు. కొన్ని సార్లు ఉద్రిక్తతలు ఉన్న దేశాల (ఉగ్రభయాలు, భూకంపాలు అధికంగా ఉండే)కు వెళ్తున్నారు. ఇలాంటి చోట్లకు వెళ్లినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే.. బీమా పాలసీ క్లెయిమ్​ చేసుకోవడం కొన్ని సందర్భాల్లో కష్టం కావచ్చు. బీమా పాలసీ తీసుకునే ముందే మీరు ఆయా దేశాల్లో ఉంటే.. పాలసీ తీసుకునేప్పుడు బీమా కంపెనీ ఈ విషయాన్ని పరిగణనలోనికి తీసుకొని, పాలసీని అందిస్తుంది. మీరు ఉన్న ప్రాంతం, అక్కడి పరిస్థితులను బట్టి మీకుండే నష్టభయాన్ని అంచనా వేస్తుంది. అవసరమైతే కొంత ఎక్కువ ప్రీమియాన్ని వసూలు చేసి, పాలసీని అందించే అవకాశం ఉంది.

కొత్త పాలసీ తీసుకునేప్పుడు కూడా మీరు ఎక్కువగా ఏయే దేశాలు పర్యటించే అవకాశం ఉందో తెలియజేయాల్సిన బాధ్యత పాలసీదారుడిపై ఉంటుంది. మీరు చెప్పిన వివరాల ఆధారంగా ప్రీమియం అధికంగా వసూలు చేయవచ్చు. లేదా కొన్నిసార్లు పాలసీ ఇవ్వడానికి నిరాకరించవచ్చు. ఇప్పటికే బీమా పాలసీలు ఉన్నవారు.. విదేశీ ప్రయాణాలు చేసేప్పుడు బీమా సంస్థకు ఆ విషయం తెలియజేయడం మంచిది.

పాలసీ పత్రాలు పోతే...

జీవిత బీమా పత్రాలను జాగ్రత్తగా దాచుకోవడం ఎంతో ముఖ్యం. పాలసీ క్లెయిమ్​ చేసుకునేటప్పుడు వాటినే ప్రామాణికంగా పరిగణిస్తారు.
ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు బీమా ఇచ్చిన సంస్థను సంప్రదించి పత్రాలు పోయిన విషయం చెప్పాలి. వారికి కావాల్సిన వివరాలు అందివ్వడం ద్వారా బీమా పత్రాల నకలును పొందొచ్చు.

ప్రస్తుతం ఇలాంటి సమస్యలు తలెత్తకుండా బీమా నియంత్రణ మండలి (ఐఆర్​డీఏఐ) కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని బీమా పత్రాలను బ్యాంకు ఖాతాకు ఈ-ఇన్స్యూరెన్స్​ రూపంలోకి మార్చుకునే వీలు కల్పిస్తోంది. ఇప్పటికే ఉన్న పాలసీలను, కొత్తగా తీసుకునే పాలసీలను ఈ విధానంలోకి మార్చుకోవచ్చు.

Last Updated : Sep 27, 2019, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details