కరోనా కారణంగా ఆరు నెలలకుపైగా మూత పడిన సిసిమా హాళ్లు ఇటీవలే తెరుచుకున్నాయి. 50శాతం సిట్టింగ్ సామర్థ్యంతో థియేటర్లను తెరుచుకునేందుకు.. అన్‌లాక్ 5.0లో కేంద్రం అనుమతించింది. అయినప్పటికీ ప్రేక్షకులను ఆకర్షించడంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నాయి థియేటర్ల యజమాన్యాలు.
కారణలేమిటి?
ఈ విషయంపై దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటర్స్ ఫ్రాంచైజీ ఐనాక్స్ సీఈఓ అలోక్ టండన్‌ను సంప్రదించింది 'ఈటీవీ భారత్'. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి కారణాలు సహా భవిష్యత్ అంచనాలపై పలు విషయాలు ఆయన 'ఈటీవీ భారత్'తో పంచుకున్నారు.
"సినిమా రంగానికి కీలకమైన వనరు కంటెంట్. ప్రస్తుతం తాజా కంటెంట్ లేమీ కారణంగా.. మేము ఇంకా సాధారణ కార్యకలాపాల బెంచ్‌మార్క్‌ను చేరుకోలేకపోతున్నాము. కొత్త సినిమాలు లేకపోవడం వల్ల చాలా రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ ఆక్యుపెన్సీ మాత్రమే నమోదవుతోంది.' అని అలోక్ టండన్ చెప్పారు.
అయితే దీనికి బంగాల్ మాత్రం మినహాయింపు అన్నారు అలోక్. బెంగాలీ సిసిమాలు విడుదలవుతుండటం వల్ల ఆ రాష్ట్రంలో కాస్త మెరుగైన పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు.