కొవిడ్ అనంతరం గృహ కొనుగోలుదారులు విస్తీర్ణంలో పెద్ద ఇంటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే విధంగా శివారు ప్రాంతాల్లో ఇళ్లకు, బ్రాండెడ్ డెవలపర్ల ఇళ్లకు మొగ్గు చూపుతున్నారు. సీఐఐ ఆనరాక్ నిర్వహించిన కొవిడ్ సెంటిమెంట్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. మిలీనియల్స్ కొత్త తరం గృహ కొనుగోలుదారులుగా ఉన్నారని సర్వే తెలిపింది. రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ప్రాధాన్యత పెరుగుతోందని..ఎన్ఆర్ఐలు ఎక్కువగా లగ్జరీ గృహాలపై పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది.
సర్వే ప్రకారం.. ఈక్విటీ, బంగారంతో పోల్చితే రియల్ ఎస్టేట్‌కు తొలి ప్రాధాన్యం 57 శాతం మంది ఇస్తున్నారు. దీని అనంతరం 24 శాతం మంది ఈక్విటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో ఇప్పటికే 24 శాతం మంది ఇంటి కొనుగోలు సంబంధించి బుకింగ్ చేసుకున్నారు. 62 శాతం మంది గృహ కొనుగోలుకు ఇది సరైన సమయమని భావిస్తున్నారు. గత సర్వే లాక్డౌన్ సమయంలో చేసినప్పుడు.. 6 శాతం మంది బుకింగ్స్ చేసుకోగా 54 శాతం మంది ఆ సమయాన్ని సరైన సమయని భావించారు.
శివారు ప్రాంతాలకు ప్రాధాన్యం
కరోనా మహమ్మారి వల్ల 59 శాతం మంది నిర్ణయాలన్ని మార్చుకున్నారని సర్వే వెల్లడించింది. కొవిడ్ కంటే ముందు ఇళ్లు కొనుగోలుపై కచ్చితంగా లేనప్పటికీ.. మహమ్మారి అనంతరం కచ్చితంగా కొనుగోలు చేయాలని అనుకుంటున్నారని పేర్కొంది. 66 శాతం మంది శివారు ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 84 శాతం మంది 2 బీహెచ్ కే, 3 బీహెచ్ కే లను గతంలో కంటే ఎక్కువ విస్తీర్ణంతో కోరుకుంటున్నారు.
సొంత వినియోగానికి కొనే వారి శాతం పెరిగింది. సొంత ఉపయోగానికి కొనేవారు, పెట్టుబడిపరంగా కొనుగోలు చేసేవారి నిష్పత్తి 74:26గా ఉంది. ఇది కొవిడ్ కంటే ముందు 59:41 గా ఉండేది.
వారి నుంచి సురక్షితం..
కొవిడ్ ముందు 35 శాతం వరకు నివాసానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చే వారు. లాక్డౌన్లో ఇది 46 శాతానికి పెరిగిందని.. అయితే ఇప్పుడు 29 శాతానికి పడిపోయిందని సర్వే పేర్కొంది. కొత్తగా నిర్మాణం అవుతోన్న వాటికి లాక్డౌన్ సమయంలో 18 శాతం మంది ప్రాధాన్యం ఇవ్వగా.. ఇప్పుడు అది 26 శాతానికి పెరిగింది. రెడీ టూ మూవ్ విభాగంలో తక్కువ సరఫరా ఉండటం వల్ల అదే విధంగా కొవిడ్ అనంతరం బ్రాండెడ్ డెవలాపర్లు ఎక్కువ నిర్మాణాలు చేపడుతుండటం.. వారి నుంచి కొనుగోలు చేయటం సురక్షితమని ప్రజలు అనుకోవటమే కారణమని భావిస్తున్నట్లు సర్వే నివేదిక వెల్లడించింది.