ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై కాంపిటిషన్ కమిషన్ అఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తునకు ఆదేశించింది. భారీ రాయితీలు ప్రకటించడం, తమ వేదికలపై ఎంచుకున్న అమ్మకందార్లతో కుమ్మక్కు అవుతున్నారన్న ఆరోపణలపై విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. అమ్మకాలు చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
'నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయ్'
ఈ కామర్స్ సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తూ 'దిల్లీ వ్యాపార్ మహాసంఘ్' దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ చర్యలు చేపట్టింది. దిల్లీ వ్యాపార్ సంఘ్‌లో అనేక మంది స్మార్ట్‌ఫోన్, దాని సంబంధిత ఉపకరణాలు విక్రయించేవారు అధికంగా ఉన్నారు.
ఈ-కామర్స్ సంస్థలు ప్రిఫరెన్షియల్ లిస్టింగ్, ఎక్స్‌క్లూజివ్ టై-అప్స్, ప్రైవేట్ లేబుల్స్ వంటి పద్ధతులు అవలంభిస్తున్నాయని దిల్లీ వ్యాపార్ మహాసంఘ్ ఆరోపించింది. ఇవి ఆరోగ్యకరమైన వ్యాపార పద్ధతులకు పూర్తిగా విరుద్ధమని పేర్కొంది.
అమెజాన్ స్పందన
సీసీఐ ఉత్తర్వులపై అమెజాన్ ఇండియా ప్రతినిధి స్పందించారు. తమపై తమకు నమ్మకముందని, సీసీఐతో పూర్తిగా సహకరిస్తామని ఆయన అన్నారు.