మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పలు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా బ్యాంకింగ్ రంగంలో పలు కీలక సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది. 2020 కేంద్ర బడ్జెట్ను మరికొద్ది రోజుల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. మరి ఇందులో ఈ కీలక సంస్కరణలకు చోటిస్తుందా?
బ్యాంకుల విలీనం?
బ్యాంకింగ్ రంగ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్యాంకుల విలీనాన్ని ప్రతిపాదించింది. 10 ప్రభుత్వరంగ బ్యాంకులను పరస్పరం విలీనం చేసి 4 పెద్ద బ్యాంకులుగా మార్చింది. ఈ చర్యలు బ్యాంకింగ్ రంగం కోలుకోవడానికి దోహదపడతాయని, ఆర్థికవ్యవస్థకు మంచి చేస్తాయని ప్రకటించింది.
నిరర్ధక ఆస్తులు
నిరర్ధక ఆస్తులు బ్యాంకులకు గుదిబండగా మారుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇవి తగ్గుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. గణాంకాలు కూడా ఈ విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయి. కనుక త్వరలోనే బ్యాంకులు కోలుకుంటాయని ప్రభుత్వం నమ్మకంగా చెబుతోంది.
ఇది నిజమేనా?
ప్రభుత్వ ప్రకటనలకు వాస్తవ పరిస్థితులకు మధ్య చాలా అంతరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కార్పొరేటు కంపెనీలు మళ్లీ మొండి బాకీల బారిన పడే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల అప్పులు ఆయా కంపెనీల నికర విలువ కంటే చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని వారు ఎత్తిచూపుతున్నారు.
మొండి బకాయిలుగా ముద్రా రుణాలు
చిన్న తరహా పరిశ్రమలకు రుణాలందించడం కోసం ఉద్దేశించిన బృహత్తర పథకం ముద్రా రుణాలు. అయితే ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తాయనే ఆశలతో లబ్ధిదారులు చాలా మంది తమ రుణాలు, వడ్డీలు చెల్లించడం లేదు. ఫలితంగా ఇవి మొండి బకాయిలుగా మారిపోతున్నాయి.