కెయిర్న్ ఎనర్జీ రెట్రోస్పెక్టివ్ (పాత తేదీల నుంచి విధించే) పన్ను వివాదం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పులో చెప్పినట్లుగా 1.2 బిలియన్ డాలర్ల అవార్డును చెల్లించాల్సిందేనంటూ అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించింది. ఆ మొత్తం చెల్లింపునకు ప్రభుత్వరంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాను బాధ్యురాలిని చెయ్యాలని కోరుతూ కోర్టులో దావా వేసింది. బ్రిటన్‌తో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని ఆ మేరకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని పిటిషన్‌లో ఆరోపించింది. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఎయిర్ ఇండియాను, ప్రభుత్వాన్ని వేరు చేసి చూడలేమని పేర్కొంది.
దీనిపై ఎయిర్ ఇండియా ఇంకా స్పందించలేదు. కానీ, కేంద్ర ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ప్రభుత్వానికిగానీ, ఎయిర్ ఇండియాకుగానీ ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. కెయిర్న్ చర్యను చట్టవిరుద్ధమని తెలిపిన ఆయన ప్రభుత్వం, ఎయిర్ ఇండియా దీనిపై న్యాయపరంగా ముందుకు వెళతాయని పేర్కొన్నారు. అయితే, ఈ ఏడాది ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కెయిర్న్ దావా అడ్డుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ది హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ఆర్బిట్రేషన్ కోర్టు) ఆదేశాల మేరకు తమకు భారత ప్రభుత్వం నుంచి 1.2 బిలియన్ డాలర్లను ఇప్పించాలని కోరుతూ కెయిర్న్ ఎనర్జీ అమెరికాలోని న్యాయస్థానంలో తాజాగా దావా వేసింది. ఆర్బిట్రేషన్ తీర్పును గుర్తిస్తూ చక్రవడ్డీతో సహా పరిహారాన్ని ఇప్పించాలని అమెరికా సహా యూకే, నెదర్లాండ్స్‌లోనూ గతంలోనే పిటిషన్లు దాఖలు చేసింది. సొమ్ము చెల్లించకపోతే ఆయా దేశాల్లో ఉన్న భారత ఆస్తులను సీజ్ చేయించి మరీ వసూలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఆ మేరకు భారత ప్రభుత్వానికి విదేశాల్లో ఉన్న ఆస్తులను కెయిర్న్ ఎనర్జీ గుర్తించింది. అందులో భాగంగా తాజాగా ఎయిర్ ఇండియాను ఈ వివాదంలోకి లాగింది.