నేడు కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింత ప్రోత్సహించే విధంగాఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. సింగిల్ బ్రాండ్ రిటైల్, డిజిటల్ మీడియా రంగాల్లో సడలింపుల ద్వారా విదేశీ పెట్టుబడిదారులను ఆకట్టుకునేందుకు చర్యలు తీసుకోనుంది. వీటితో పాటు బొగ్గు గనుల నిర్వహణ, ఒప్పంద ఉత్పత్తి రంగాల్లో నిబంధనలను సరళీకరించనున్నట్లు తెలుస్తోంది.
డిజిటల్ మీడియాలో పెట్టుబడులు..
ప్రస్తుతం ఉన్న విదేశీ పెట్టుబడుల విధానాల్లో ఒప్పంద ఉత్పత్తి రంగం గురించి పేర్కొనలేదు. ఈ రంగంపై స్పష్టత అవసరమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డిజిటల్ మీడియా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విధానం ప్రవేశపెట్టే అంశంపై స్పష్టతకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రింట్ మీడియా రంగంలో 26 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తుండగా ప్రసార రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐలను ప్రభుత్వం అనుమతిస్తోంది.