భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. సంస్కృతి, సంప్రదాయాల్లో బంగారం ఓ భాగం. పెళ్లిళ్లు, పేరంటాలు ఏవైనా ఆడవాళ్లు బంగారం ధరించాల్సిందే. పెళ్లి జరిగినప్పుడు పెళ్లి కూతురు ఒంటిపై బంగారం మెరవాల్సిందే. భారత్‌లో బంగారాన్ని పెట్టుబడి సాధానంగా మాత్రమే పరిగణించరు. పెళ్లిళ్లు, పుట్టినరోజులు వంటి శుభకార్యాలకు కానుకగా ఇస్తారు. చాలా మంది దంతేరస్, దీపావళి, అక్షయ తృతీయ వంటి రోజుల్లో బంగారు కొనుగోలు చేయటం శుభసూచికంగా భావిస్తారు. భారతీయ గృహిణుల పొదుపుల్లో బంగారం నాలుగింట మూడొంతులు ఉంటుంది. అయితే.. ఎంత వరకు బంగారం మన వద్ద పెట్టుకోవచ్చు? ఎంతస్థాయి వరకు పత్రాలు అవసరం ఉండవు? ఈ విషయాలపై అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది.
ఆర్థిక శాఖ ప్రకారం..
ఆదాయ స్థాయితో సంబంధం లేకుండా కొంత మొత్తంలో బంగారం మన వద్ద ఉంచుకోవచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకారం ఇది ఆడవారికి, మగవారికి వేరువేరుగా ఉంటుంది. అంతకు మించి ఉంటే ఆ బంగారాన్ని సీజ్ చేస్తారు.
- పెళ్లైన ఆడవారు- 500 గ్రాములు
- పెళ్లి కాని ఆడవారు- 250 గ్రాములు
- పురుషులు- 100 గ్రాములు
ఈ స్థాయిల వరకు ఎలాంటి ఆదాయ ధ్రువీకరణ సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఆదాయ స్థాయిలతో దీనికి సంబంధం ఉండదు.
చట్టాలు ఏం చెబుతున్నాయి?
చట్ట పరంగా ఎంత మేరకు పసిడి ఉంచుకోవచ్చో తెలిపే చట్టాల గురించి అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ఆదాయ పన్ను చట్టం-1961లోని సెక్షన్ 132 ప్రకారం.. తనిఖీలు నిర్వహించిన క్రమంలో ఆభరణాలు, బంగారం, ఇతర విలువైన వస్తువులకు సరైన వివరాలు తెలియజేయకపోతే.. అధికారులు సీజ్ చేస్తారు. బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో సరైన ఆధారాలు చూపితే ఎంతైనా తమ దగ్గర పెట్టుకోవచ్చని ఈ చట్టాలు చెబుతున్నాయి.
ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు ఉండాలి?
వారసత్వంగా వచ్చిన బంగారం, సొంతంగా కొనుగోలు చేసిన బంగారానికి రెండింటినీ కలిపి లిమిట్‌లో పరిగణనలోకి తీసుకుంటారు. వారసత్వంగా వచ్చిన బంగారం అయితే… వారసత్వంగా వచ్చినట్లు ధ్రువీకరించగలగాలి. వాస్తవ యజమాని పేరుతో పత్రాలున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది.
ఎక్కువ బంగారం ఉన్నట్లయితే దానికి సంబంధించిన పన్ను సంబంధిత కాగితాలను మీ వద్ద ఉంచుకోవాలి. బంగారం గురించి వీలునామాలో ఉన్నట్లయితే… అది కూడా వారసత్వానికి ధ్రువీకరణగా ఉపయోగపడుతుంది. కుబుంబ ఆస్తుల పంపకం, కానుక డీడ్‌ను కూడా ధ్రువీకరణగా చూపించవచ్చు.
ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేనట్లయితే.. కుటుంబ సామాజిక పరిస్థితి, సంప్రదాయాలను పరిశీలించి మనం చెబుతున్నది వాస్తవమా? కాదా? అనే దానిపై అధికారులు స్పష్టతకు వస్తారు.
ఇదీ చూడండి:బంగారంలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా?