దేశంలోనే మొట్టమొదటి సారిగా నిర్మించనున్న ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్‌లో మరో కీలక కాంట్రాక్టును దిగ్గజ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సొంతం చేసుకుంది. ఈ సంస్థతోపాటు జపాన్‌కు చెందిన ఐహెచ్ఐ సిస్టమ్స్ సంస్థ సంయుక్తంగా ఈ కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకున్నాయి. దీనిలో భాగంగా రూ.1,390 కోట్లు ఖర్చు చేసి 28 స్టీల్ బ్రిడ్జ్‌లను నిర్మించనున్నాయని జాతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ తెలిపింది. ఈ బ్రిడ్జ్‌లను రైల్వే లైన్లు, నదులు, హైవేలు, ఇతర కట్టడాలపైన నిర్మిస్తాయని వివరించింది. మొత్తం బ్రిడ్జ్‌ల నిర్మాణానికి 70వేల మెట్రిక్ టన్నుల స్టీల్ అవసరమవుతుందని.. దీనివల్ల భారత్‌లోని స్టీల్ కంపెనీలకు అధిక లాభాలు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది.
"మొత్తం 28 స్టీల్ బ్రిడ్జ్‌లో ఒక్కోదాని పొడవు 60-130 మీటర్ల మధ్య ఉంటుంది. అన్ని స్టీల్ బ్రిడ్జ్‌లను కలిపితే 4.5కిలోమీటర్ల దూరం ఉంటుంది. భారత్‌లో నిర్మాణ సంస్థల నైపుణ్యాలపై జపనీస్ అధికారులతో కలిసి గతంలోనే ఒక కమిటిని ఏర్పాటు చేశాం. అయితే స్టీల్ బ్రిడ్జ్‌లను నిర్మించగల సామర్థ్యం భారత్‌లోని నిర్మాణ సంస్థలకు ఉందని కమిటీ తెలిపింది. ఫ్యాబ్రికేషన్ పనులను భారత కంపెనీలకు ఇస్తే 'మేక్ ఇన్ ఇండియా' బలోపేతం అవుతుంది. నిర్మాణ వ్యయం సైతం తగ్గుతుంది. నైపుణ్యమైన భారత టెక్నీషియన్లతో 'మేక్ ఫర్ వరల్డ్'ను సైతం సాధించవచ్చు."