తెలంగాణ

telangana

ETV Bharat / business

బీఎస్‌ఎన్‌ఎల్‌కు భరోసా ఏదీ....? - టెలీ సాంద్రత

దేశంలో మొదటి నుంచి టెలికమ్​ రంగంలో సేవలందిస్తూ తనదైన ముద్ర వేసుకున్న బీఎనస్ఎన్​ఎల్​..ప్రస్తుతం నష్టాల ఊబిలోకి పడిపోయింది. 40 వేల కోట్ల మిగులు నిధులతో దివ్యంగా ఉండేది సంస్థ..ఆలాంటిది రెండు దశాబ్దాలు తిరక్కుండానే 13,వేల కోట్ల లోటులోకి జారిపోయింది. ఈ పరిస్థితికి ప్రధానంగా ప్రైవేటు టెలికామ్​ సంస్థలు రావడం...ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణమనే ఆరోపణలు తలెత్తుతున్నాయి.   ​

బీఎస్‌ఎన్‌ఎల్‌కు భరోసా ఏదీ?

By

Published : Aug 23, 2019, 7:38 PM IST

Updated : Sep 28, 2019, 12:42 AM IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడు బ్రిటిష్‌ పాలకుల నుంచి సంక్రమించిన తంతి, తపాలా విభాగం చాలా పరిమితమైనది. అప్పటి దేశ జనాభా 35 కోట్లలో 82,000 వేల మందికే టెలిఫోన్లు ఉండేవి. అంటే ప్రతి 100మందిలో 0.023 మందికి ఒక్క ఫోన్‌ అన్న మాట. దీన్నే టెలీ సాంద్రత అంటారు. 1985లో ఈ విభాగాన్ని తపాలా విభాగం (డీఓపీ), టెలీ కమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ) అని రెండుగా విభజించారు. 1991 ఆర్థిక సంస్కరణలు ప్రైవేటు ఆపరేటర్లకు తలుపులు తెరిచాయి. 1995 నుంచి సెల్యులర్‌ సేవలు మొదలయ్యాయి. 2000 అక్టోబరు ఒకటిన డీఓటీ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ (భారతీయ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌)ను వేరుచేశారు.

దయనీయ స్థితిలో సంస్థ

అప్పట్లో నాలుగు లక్షలమంది ఉద్యోగులు, రూ.40,000 కోట్ల మిగులు నిధులతో సంస్థ దివ్యంగా ఉండేది. అటువంటి సంస్థ రెండు దశాబ్దాలు తిరక్కుండానే రూ.13,000 కోట్ల లోటులోకి జారిపోయింది. నవరత్న హోదాను పోగొట్టుకొని ఖాయిలా పడుతున్న ప్రభుత్వ రంగ సంస్థగా మిగిలింది. సంస్థలోని 1.65 లక్షలమంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి దాపురించింది. 1947 నుంచి 1995లో ప్రైవేటు ఆపరేటర్ల ప్రవేశం వరకు బీఎస్‌ఎన్‌ఎల్‌ పలు దశలు దాటింది. మానవ సిబ్బంది నడిపే మాగ్నెటో టెలిఫోన్‌ నుంచి డిజిటల్‌ ఎలక్టాన్రిక్‌ ఎక్స్ఛేంజీల వరకు, టెలిఫోన్‌ స్తంభాల నుంచి ఉపగ్రహ ట్రాన్స్‌పాండర్ల వరకు, బిట్‌లలో మోర్స్‌కోడ్‌ ఎనలాగ్‌ సిగ్నల్స్‌ నుంచి టెరాబిట్స్‌లో డిజిటల్‌ డేటా ప్రసారాల వరకు ఎంతో దూరం పయనించింది. 1995లో ప్రైవేటు ఆపరేటర్లు రంగ ప్రవేశం చేసే లోపు అర్ధ దశాబ్ది కాలంలో టెలీ సాంద్రత 46.5 రెట్లు పెరిగింది. అప్పటికి జనాభా 2.6 రెట్లు మాత్రమే పెరిగింది. మరో విధంగా చెప్పాలంటే 1947లో 0.023గా ఉన్న టెలీసాంద్రత 1995లో 1.07కి చేరింది. అప్పటి నుంచి 2019 జనవరి వరకు జనాభా 1.45 రెట్లు పెరిగి 132 కోట్లకు చేరగా టెలీసాంద్రత 85.8 రెట్లు పెరిగి 91.82కు చేరుకుంది.

ప్రజాప్రయోజనాలకే ప్రాధాన్యం

స్వాతంత్య్రం వచ్చిన తరవాత తొలి 50 ఏళ్లలో ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాతిపదికన నిధులేమీ కేటాయించకపోయినా డీఓటీ విశాల టెలీకమ్యూనికేషన్ల వ్యవస్థ సృష్టికి పటిష్ట పునాది ఏర్పరచడం మామూలు విజయం కాదు. ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌కూ ప్రైవేటు ఆపరేటర్లకూ మధ్య తేడాను గుర్తించడం అవసరం. ప్రైవేటు ఆపరేటర్ల ప్రధాన లక్ష్యం లాభాలు ఆర్జించిపెట్టడమే. బీఎస్‌ఎన్‌ఎల్‌కు లాభాలే పరమావధి కాదు. ప్రజాప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తుంది. వానొచ్చినా వరద వచ్చినా, కర్ఫ్యూ పెట్టినా తన పనిమాత్రం ఆపదు. తిరుగుబాట్లు, భూకంపాలు జురుగుతున్న ప్రాంతాలకూ, దుర్గమ కొండ ప్రాంతాలకూ, దేశ సరిహద్దులకూ లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తుంది.

ప్రైవేటు ఆపరేటర్లకు ఉన్న వెసులుబాటు లేదు

ప్రైవేటు టెలికం సర్వీసు ప్రొవైడర్లు (టీఎస్పీ) ఈక్విటీ షేర్లు లేదా రుణ పత్రాలతో మూల ధనం సేకరించవచ్చు. 2019 మార్చి వరకు ప్రైవేటు టీఎస్పీలు మొత్తం రూ.4.5 లక్షల కోట్ల రుణ భారం మోస్తున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌పై రుణభారం కేవలం రూ.13,000 కోట్లయినా, ప్రైవేటు టీఎస్పీలను మించి విమర్శలను ఎదుర్కోవలసి వస్తోంది. టీఎస్పీలు వ్యాపారం బాగుంటే ఉద్యోగులను నియమించుకుని, నష్టాలు వస్తే ఉద్వాసన పలుకుతుంటాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఆ వెసులుబాటు లేదు. ప్రైవేటు టీఎస్పీలు తమకు నచ్చిన స్పెక్ట్రమ్‌ కోసం వేలంలో పోటీ పడితే, బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రభుత్వం కేటాయించే స్పెక్ట్రమ్‌తోనే సరిపెట్టుకోవలసి ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వవర్గాలకు ఉచిత సేవలు అందించక తప్పదు. ప్రైవేటు ఆపరేటర్లకు అలాంటి బాధ్యత లేదు. అవసరమైన మౌలిక వసతులు, వస్తువుల కొనుగోలు, సేవల మార్కెటింగ్‌, అమ్మకాలకు సంబంధించి టీఎస్పీలు వేగంగా, తమకు తాముగా నిర్ణయాలు తీసుకోగలుగుతాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌కు అలాంటి స్వేచ్ఛ లేదు.

రెండు దశాబ్దాల్లో ఎన్నో మార్పులొచ్చినా....

సేవలకు ధరల నిర్ణయానికి వస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌ చిత్రమైన స్థితిని ఎదుర్కొంటోంది. గడచిన 20 ఏళ్లలో ద్రవ్యోల్బణం వల్ల ఆహారం, ఆరోగ్యం, రవాణా తదితర రంగాల్లో ధరలు రెట్టింపైతే, పెట్రోలు, డీజిల్‌ ధరలు వరుసగా 243, 386 శాతం చొప్పున పెరిగాయి. కానీ, కాల్‌ చార్జీలు, డేటా ధరలు 92, 98 శాతం చొప్పున క్షీణించాయి. ఇంధన ధరలు ఎక్కువగా ఉన్న 165 దేశాల్లో భారతదేశానిది 70వ స్థానమైతే కాల్‌, డేటా చార్జీలు కారుచౌకగా ఉన్న దేశాల్లో భారత్‌ అగ్రశ్రేణిలో ఉంది. అసలు వ్యయంకన్నా తక్కువ ధరకు కాల్‌, డేటా చార్జీలు పడిపోవడం వల్ల టెలికం సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. వాటికి రుణాలిచ్చిన ఆర్థిక సంస్థలు కుదేలయ్యాయి. ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది. సరైన స్పెక్ట్రమ్‌, మౌలిక వసతులు లేక, అవసరానికన్నా ఎక్కువ సిబ్బందిని మోస్తూ బీఎస్‌ఎన్‌ఎల్‌ గుక్కతిప్పుకోలేని స్థితిలో పడిపోయింది.

ప్రభుత్వం చొరవ కరవు

ప్రభుత్వం ఇకనైనా మేల్కొని పరిష్కార చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు ప్రైవేటు టీఎస్పీలకు ఉత్పత్తి వ్యయం తగ్గించడానికి ప్రాధాన్యమిస్తూ, ఖజానాను నష్టపరస్తూ వచ్చాయి. వస్తుసేవలను ఉత్పత్తి వ్యయంకన్నా తక్కువకు విక్రయించకూడదనే ఆర్థిక శాస్త్ర మూల నియమాన్ని ఉల్లంఘిస్తున్నాయి. అదే బీఎస్‌ఎన్‌ఎల్‌ దగ్గరకు వచ్చేసరికి పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ప్రభుత్వం ఇకనైనా ఉచిత కానులకూ, రాయితీలకూ స్వస్తి పలికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఒకే విధమైన నియమ నిబంధనలను వర్తింపజేయాలి.

ఇకనైనా మేల్కొనాలి

కొత్త పెట్టుబడులను సమకూర్చి, అనవసర సిబ్బందిని తగ్గించి, కొన్ని ఆస్తులు అమ్మి అయినా అప్పులు తీర్చి బీఎస్‌ఎన్‌ఎల్‌ను పునరుజ్జీవింపజేయాలి. 2022కల్లా 1.65 లక్షలమంది సిబ్బందిలో సగంమంది ఉద్యోగ విరమణ చేస్తారు. ఆ మేరకు సంస్థ ఖర్చులు తగ్గుతాయి. రానురానూ సాంకేతిక మార్పులు వేగం పుంజుకుంటున్న సమయంలో, ప్రభుత్వ నిబంధనల చట్రం బీఎస్‌ఎన్‌ఎల్‌కు గుదిబండ కానుంది. టెలికం విభాగం నుంచి దీనిని వేరుచేయడం వల్ల లాభం లేకపోగా నష్టమే ఎక్కువని అనుభవంలో తేలింది. కాబట్టి బీఎస్‌ఎన్‌ఎల్‌ను మళ్లీ టెలికం విభాగం (డీఓటీ)లో విలీనం చేయాలి. ప్రైవేటు టీఎస్పీలకూ డీఓటీకి మధ్య స్పష్టమైన విభజన రేఖను గీయాలి.

పునరుజ్జీవానికి ప్రయత్నాలు

ప్రభుత్వం ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్నట్లే ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ల పునరుజ్జీవనానికి వీలుగా వాటికి 4 జీ స్పెక్ట్రమ్‌ను కేటాయించడానికి ప్రధానమంత్రి కార్యాలయం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. రెండు సంస్థల ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విరమణ పథకాన్ని వర్తింపజేయడం, పదవీ విరమణ వయసును 58 ఏళ్లకు తగ్గించడం తదితర అంశాలు ప్రభుత్వ అజెండాలో ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌, మహానగర్‌ టెలికం నిగం (ఎంటీఎన్‌ఎల్‌) విలీన ప్రతిపాదనకు పీఎంఓ స్వస్తి చెప్పింది. ఈ రెండు సంస్థల పునరుజ్జీవనానికి మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. వీటికి కేంద్ర మంత్రివర్గ ఆమోదమే తరువాయి!

- ఎం.ఆర్‌.పట్నాయక్‌

(రచయిత- బీఎస్‌ఎన్‌ఎల్‌ మాజీ డీజీఎం)

Last Updated : Sep 28, 2019, 12:42 AM IST

ABOUT THE AUTHOR

...view details