ప్రైవేటీకరణ (BPCL Privatisation) దిశగా అడుగులు వేస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్).. వచ్చే 5 ఏళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సంస్థ ఛైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ వెల్లడించారు. పెట్రో రసాయనాల ఉత్పత్తి సామర్థ్యం పెంచడం సహా సహజ వాయువు వ్యాపారం, స్వచ్ఛ ఇంధనం, మార్కెటింగ్ మౌలిక వసతులను పెంచేందుకు ఈ నిధుల్ని వినియోగించనున్నట్లు వివరించారు. భవిష్యత్‌లో రాబోతున్న హైడ్రోజన్, విద్యుత్ వాహనాలకు అనువుగా బీపీసీఎల్ మారేందుకు ఈ పెట్టుబడులు దోహదం చేయనున్నాయని తెలిపారు.
అవి ఎనర్జీ స్టేషన్లుగా..
1,000 మెగావాట్ల పోర్ట్‌ఫోలియోతో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యంపై దృష్టి సారించామని, ఈ మేరకు ఈ రంగంలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయడం సహా బయోడీజిల్, హైడ్రోజన్ ఉత్పత్తిపై పెట్టుబడులు కొనసాగిస్తామని అరుణ్ (BPCL News) వెల్లడించారు. ప్రస్తుతమున్న 19,000 పెట్రోల్ పంపుల స్థానంలో 7,000 పంపుల్ని మధ్య-దీర్ఘకాలానికి ఎనర్జీ స్టేషన్లుగా మార్చే లక్ష్యంతో పని చేస్తున్నామని, ఇక్కడ పెట్రోల్, డీజిల్, ఫ్లెక్సి ఇంధనాలు, ఈవీ ఛార్జింగ్ సదుపాయాలు, సీఎన్‌జీ, హైడ్రోజన్ వంటివి విక్రయిస్తామని తెలిపారు (BPCL Latest News). పెట్రోరసాయనాల సామర్థ్యాన్ని పెంచడం కోసం రూ.30,000 కోట్లు, గ్యాస్ ప్రొలిఫరేషన్ కోసం రూ.20,000 కోట్లు, అప్‌స్ట్రీమ్ ముడిచమురు, సహజవాయువు వెలికితీత, ఉత్పత్తికి రూ.18,000 కోట్లు, మార్కెటింగ్ వసతుల అభివృద్ధికి రూ.18,000 కోట్లు, పునరుత్పాదక ఇంధనంపై రూ.5,000 కోట్లు, బయోడీజిల్‌పై రూ.7,000 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు వివరించారు.
బీపీసీఎల్ ప్రైవేటీకరణ (BPCL Privatisation) ప్రక్రియ 2022 మార్చి కల్లా ప్రభుత్వం పూర్తి చేయనుందని సంస్థ ఛైర్మన్ అరుణ్‌కుమార్ సింగ్ తెలిపారు.
ఇదీ చూడండి:బీపీసీఎల్, ఎయిరిండియాలతో ప్రైవేటీకరణ ప్రక్రియకు శ్రీకారం