BSE MD CEO Ashish Kumar: ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇతరదేశాలతో పోల్చితే మనదేశంలో స్టాక్‌మార్కెట్లు కొంత స్థిరంగా ఉన్నాయని.. ఇక్కడ కఠిన నిబంధనలు, మార్జిన్ల విధానం అమలు చేయటమే ఇందుకు కారణమని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) ఎండీ, సీఈఓ ఆశీష్ కుమార్ చౌహాన్ అన్నారు. త్వరలో విద్యుత్తు, వ్యవసాయోత్పత్తులు, స్టీలు, బంగారం క్రయవిక్రయాలకు తమ ప్లాట్‌ఫామ్‌ను విస్తరిస్తున్నట్లు తెలిపారు. బీఎస్‌ఈ కార్యకలాపాలు, మదుపరుల అంశాలపై ఆయన 'ఈనాడు'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
దేశీయ స్టాక్‌మార్కెట్లో లావాదేవీలు నిర్వహించే మదుపరుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. అదే సమయంలో మార్కెట్లో హెచ్చుతగ్గులు అధికంగా ఉంటున్నాయి. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ?
మదుపరుల సంఖ్య బాగా పెరిగింది. బీఎస్‌ఈలోనే ఇప్పుడు 10 కోట్లకు పైగా మదుపరుల ఖాతాలున్నాయి. మిగులు ఆదాయాలు అధికంగా ఉన్న యువత పెద్దఎత్తున స్టాక్‌మార్కెట్లో అడుగు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక బాధ్యతాయుత సంస్థగా మదుపరుల భద్రత విషయంలో రాజీలేని వైఖరిని అనుసరించాలనేదే మా విధానం. స్పెక్యులేషన్‌ను ప్రోత్సహించక, కఠిన నిబంధనలు, మార్జిన్ల విధానాలను అమలు చేస్తూ. దీర్ఘకాలిక సంపద సృష్టించాలనే ఆలోచనతో సాగుతున్నాం. దీనివల్ల హెచ్చుతగ్గులను తట్టుకునే వీలుంటుంది. మదుపరుల్లో అవగాహన పెంపొందించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నాం. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐపీఎఫ్) కింద రూ.800 కోట్ల నిధి ఉంది. దీని కింద మదుపరులకు గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు నష్టపరిహారం లభిస్తుంది.
మదుపరులు, స్టాక్ బ్రోకింగ్ సంస్థలు బీఎస్‌ఈ నుంచి కొత్తగా ఏం ఆశించవచ్చు ?
విద్యుత్తు, స్టీలు, వ్యవసాయోత్పత్తులకు సంబంధించి స్పాట్ మార్కెట్లను ఆవిష్కరించే సన్నాహాల్లో ఉన్నాం. బంగారం స్పాట్ మార్కెట్ త్వరలో ప్రారంభించబోతున్నాం. మనదేశం ఏటా 50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.75 లక్షల కోట్ల) విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా బంగారం క్రయవిక్రయాలు ఎంతో అధికం. అందువల్ల పారదర్శకంగా పసిడి క్రయవిక్రయాలకు వీలుకల్పించేందుకే స్పాట్ ఎక్స్ఛేంజీని తీసుకురాబోతున్నాం. మ్యూచువల్ ఫండ్ల పంపిణీ పెద్దఎత్తున నిర్వహిస్తున్నాం. బీమా పాలసీల పంపిణీపై దృష్టి సారిస్తున్నాం. ఇలా మదుపరులు, స్టాక్ బ్రోకింగ్ సంస్థలకు మేలు కలుగుతుంది.
బీఎస్‌ఈ స్మాల్ ఎక్స్ఛేంజీ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి ?
బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. దీన్లో 360 కంపెనీలు నమోదయ్యాయి. ఈ కంపెనీలు రూ.3,600 కోట్ల మూలధనాన్ని సమీకరించాయి. దాదాపు రూ.50,000 కోట్ల మార్కెట్ విలువను కలిగి ఉన్నాయి. మరో 75 కంపెనీలు ఇందులో నమోదు కావటానికి సిద్ధంగా ఉన్నాయి. చిన్న, మధ్యస్థాయి కంపెనీలు స్టాక్‌మార్కెట్లో నమోదు కావటానికి, మూలధనాన్ని సమీకరించటానికి ఇదొక మంచి వేదికగా మారింది.