బిట్‌కాయిన్ విలువ రోజుకో కొత్త రికార్డును బద్దలుకొడుతూ దూసుకెళ్తోంది. మంగళవారం ఈ డిజిటల్ కరెన్సీ విలువ చరిత్రలో తొలిసారిగా 50,000 డాలర్ల మైలురాయిని అధిగమించింది. ఏడాది క్రితం బిట్‌కాయిన్ విలువ 10000 డాలర్ల దరిదాపుల్లోనే ఉండటం గమనార్హం. అయితే గత మూడు నెలల్లోనే దీని ధర దాదాపు 200 శాతం పెరిగింది.
బిట్‌కాయిన్‌లో 150 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడం సహ కొనుగోలుదార్ల నుంచి బిట్‌కాయిన్ చెల్లింపులు స్వీకరించే యోచనలో ఉన్నామని గతవారం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ప్రకటించింది. దీంతో క్రిప్టో కరెన్సీ పరుగు మరింత వేగవంతమైంది. చట్టబద్ధమైన చెల్లింపులకు మరిన్ని కంపెనీలు బిట్‌కాయిన్‌ను అంగీకరించొచ్చన్న అంచనాలు తాజా పరుగుకు కారణమవుతున్నాయి. కొన్ని కారణాల వల్ల సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలను ఇష్టపడని పార్టీల కోసం, కంపెనీలు బిట్‌కాయిన్ వైపు చూస్తున్నాయి.