కెనడా విపణికి 'కొవాగ్జిన్'(Covaxin) టీకా అందించడానికి అమెరికాకు చెందిన ఆక్యుజెన్ ఇంక్. తో భారత్ బయోటెక్ అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా విపణికి సంబంధించి ఇటువంటి ఒప్పందం ఇప్పటికే ఈ రెండు సంస్థల మధ్య ఉంది. ఇప్పుడు కెనడాకు సైతం విస్తరించాలని నిర్ణయించారు. తాజా అవగాహన ప్రకారం కెనడాలో 'కొవాగ్జిన్'(Covaxin) టీకాకు అనుమతులు తీసుకుని, విక్రయించే బాధ్యతను ఆక్యుజెన్ ఇంక్. చేపడుతుంది. టీకా అమ్మకాలపై వచ్చే ఆదాయంలో 45 శాతం ఆక్యుజెన్‌కు లభిస్తుంది.
అమెరికాలో అత్యవసర అనుమతికి దరఖాస్తు
భారత్ బయోటెక్‌తో తమకు బలమైన భాగస్వామ్యం ఏర్పడిందని, అందుకే కెనడాలోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఆక్యుజెన్ ఇంక్. ఛైర్మన్ , సీఈఓ డాక్టర్ శంకర్ ముసునూరి వివరించారు. కొవాగ్జిన్‌కు(Covaxin) అమెరికాలో అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేస్తున్నామని, అదే దరఖాస్తును కెనడాలోనూ దాఖలు చేస్తామని తెలిపారు. కొవాగ్జిన్ టీకా పలు రకాల కరోనా వైరస్ వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అవుతోందని, అందువల్ల ఈ టీకాను అమెరికా, కెనడా ప్రజలకు అందించాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు.