తెలంగాణ

telangana

ETV Bharat / business

కర్ణాటక, మహారాష్ట్రల్లో భారత్​ బయోటెక్​ యూనిట్లు

కర్ణాటక, మహారాష్ట్రల్లో కొవాగ్జిన్​ ఉత్పత్తి యూనిట్లును నెలకొల్పనుంది భారత్​ బయోటెక్​. బెంగళూరు సమీపంలోని కోలార్ వద్ద గల మాలూరు పారిశ్రామికవాడలో ఓ యూనిట్​ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. పుణెలోనూ కొవాగ్జిన్ టీకా తయారీకి భారత్ బయోటెక్ సన్నాహాలు చేస్తోంది.

Bharat Biotech
భారత్​ బయోటెక్​

By

Published : May 15, 2021, 5:35 AM IST

కొవిడ్‌-19 టీకా 'కొవాగ్జిన్‌' ఉత్పత్తి నిమిత్తం భారత్‌ బయోటెక్‌ కర్ణాటక, మహారాష్ట్రల్లో కొత్త యూనిట్లు నెలకొల్పనుంది. బెంగళూరు సమీపంలోని కోలార్‌ వద్ద గల మాలూర్‌ పారిశ్రామిక వాడలో భారత్‌ బయోటెక్‌ టీకాల తయారీ యూనిట్‌ రాబోతోందని కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీఎన్‌ అశ్వత్‌ నారాయణ్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు వివరించారు. సాధ్యమైనంత త్వరగా ఇక్కడ టీకాల తయారీ మొదలు కావాలనేది తమ ఆలోచనగా తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు. ఈ ప్రదేశం బెంగుళూరు నగరానికి దగ్గరగా ఉన్నందున రాకపోకలు కూడా సులువని పేర్కొన్నారు.

ఆగస్టు కల్లా అనుబంధ సంస్థ ద్వారా

ఇదే విధంగా మహారాష్ట్రలోని పుణె లోనూ కొవాగ్జిన్‌ టీకా తయారీకి భారత్‌ బయోటెక్‌ సన్నాహాలు చేస్తోంది. భారత్‌ బయోటెక్‌ అనుబంధ సంస్థ అయిన బయోవెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మహారాష్ట్రలోని పుణెలో ఆగస్టు నాటికి టీకాల తయారీ యూనిట్‌ ప్రారంభించనుందని రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. పుణె డివిజనల్‌ కమిషనర్‌ సౌరభ్‌రావు, జిల్లా కలెక్టర్‌ రాజేష్‌ దేశ్‌ముఖ్‌ పుణెలోని మంజరి ఖుర్ద్‌ ప్రాంతంలో భారత్‌ టీకాల తయారీ యూనిట్‌ ఏర్పాటయ్యే 12 హెక్టార్ల ప్రదేశాన్ని సందర్శించారు. మెర్క్‌ అండ్‌ కో కు అనుబంధంగా ఉన్న ఇంటర్వెట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు చెందిన ఈ ప్రదేశం ఎంతో కాలంగా నిరుపయోగంగా ఉండటంతో, దీన్ని టీకాల తయారీకి వినియోగించుకోడానికి భారత్‌ బయోటెక్‌కు బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నట్లు, అందువల్ల వెంటనే టీకాల తయారీ చేపట్టవచ్చని సౌరభ్‌రావు వివరించారు.

బయోవెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు కూడా ఈ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. టీకాల తయారీ ఎంతో సంక్లిష్ట ప్రక్రియ అయినందున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. ఆగస్టు నెలాఖరు నాటికి టీకా తయారీ ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నట్లు సౌరభ్‌రావు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం సత్వరం అన్ని అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇంటర్వెట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1973లో ఎఫ్‌ఎండీ వ్యాధి (ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌) టీకాలు తయారు చేయడానికి ఈ స్థలాన్ని ఎంపిక చేసుకుని కొన్ని నిర్మాణాలు చేపట్టింది. కానీ మనదేశంలో వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించుకోవడంతో ఇక్కడ ఎటువంటి తయారీ కార్యకలాపాలు నిర్వహించడం లేదు.

ఇదీ చూడండి:ఏప్రిల్​లో​ మూడు రెట్లు పెరిగిన ఎగుమతులు

ABOUT THE AUTHOR

...view details