తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెరికాలో కొవాగ్జిన్​ క్లినికల్​ ట్రయల్స్! - అమెరికాలో భారత్ బయోటెక్​ టీకా

అగ్రరాజ్యంలో కొవాగ్జిన్ టీకాపై క్లినికల్​ ట్రయల్స్ చేపట్టనున్నట్లు భారత్​ బయోటెక్​ తెలిపింది. ఎంతమంది ఇందులో పాల్గొంటారనే వివరాలను సంస్థ వెల్లడించలేదు. అయితే, టీకాకు సంబంధించిన పరిశోధనాత్మక సమాచారాన్ని నియంత్రణ సంస్థలతో పంచుకుంటున్నట్లు భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.

భారత్​ బయోటెక్​
bharat biotech

By

Published : Jun 12, 2021, 5:38 PM IST

భారత ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ అమెరికాలో కొవాగ్జిన్‌ టీకా క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించనుంది. ఈ మేరకు కంపెనీ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. యూఎస్‌లో మార్కెట్‌ అప్లికేషన్‌ కోసం ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఏయే ప్రాంతాల్లో ట్రయల్స్‌ చేపట్టనున్నారు? అందులో ఎంతమంది వాలంటీర్లు పాల్గొంటారనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

డేటా జనరేషన్, సమాచార పారదర్శకతకు కట్టుబడి ఉన్నామన్న భారత్ బయోటెక్.. కొవాగ్జిన్ టీకా పరిశోధనాత్మక అధ్యయనాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పంచుకున్నట్లు తెలిపింది. మొదటి, రెండు దశల క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు మూడో దశ ట్రయల్స్‌కు సంబంధించిన తాత్కాలిక సమాచారాన్ని భారత్‌లోని నియంత్రణ సంస్థలతో పంచుకున్నట్లు వెల్లడించింది. ఈ సమాచారాన్ని నియంత్రణ సంస్థలు పూర్తిగా పరిశీలించినట్లు తెలిపింది. టీకా భద్రత, సమర్థతకు సంబంధించి ఏడాది వ్యవధిలో 5 అంతర్జాతీయ జర్నల్స్‌లో 9 పరిశోధనాత్మక అధ్యయనాలను ప్రచురించినట్లు పేర్కొంది.

భారత్‌లో క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్న ఏకైక ప్రొడక్ట్‌ తమదేనన్న భారత్ బయోటెక్.. ప్రస్తుత వేరియంట్లపై సమాచారాన్ని ప్రచురించింది సైతం తామేనని వెల్లడించింది. భారతీయుల్లో టీకా సమర్థతపై సమాచారాన్ని పంచుకున్న తొలి సంస్థ సైతం తమదేనని భారత్ బయోటెక్ వెల్లడించింది.

బీఎల్ఏ కోసం..

కరోనా వ్యాప్తి నివారణ కోసం భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకాను విదేశాల్లోనూ మార్కెటింగ్‌ చేయాలని భావిస్తున్న సంస్థ.. ఇందుకోసం ఆక్యుజన్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాలో కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగం కోసం ఆక్యుజన్‌ దరఖాస్తు సిద్ధం చేయగా.. అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ యూఎప్‌ఎఫ్‌డీఐ అందుకు అనుమతించలేదు. అత్యవసర వినియోగానికి బదులు బయోలాజిక్స్‌ లైసెన్స్‌ అప్లికేషన్‌(బీఎల్‌ఏ) సమర్పించాలని సూచించింది. అయితే బీఎల్‌ఏకు దరఖాస్తు చేసుకోవాలంటే టీకా గురించి మరింత సమాచారాన్ని అందించాలి. ఈ నేపథ్యంలోనే భారత్‌ బయోటెక్‌ అక్కడ కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు సిద్ధమైంది.

ఇదీ చూడండి:COVAXIN: పూర్తి స్థాయి అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని యూఎస్​ఎఫ్​డీఏ సూచన

ABOUT THE AUTHOR

...view details