పండుగల సీజన్లో షాపింగ్ల కోసం భారీగా ఖర్చు చేస్తుంటాం. ముఖ్యంగా క్రెడిట్ కార్డు చేతిలో ఉంటే ఇష్టారీతిన ఖర్చు చేసి ఆ తర్వాత.. వాటిని సర్దుబాటు చేసేందుకు ఇబ్బందులు పడేవాళ్లని చూస్తుంటాం. క్రెడిట్ కార్డుల వినియోగంతో సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే పాటించాల్సిన అంశాలను ఓసారి చదివేద్దాం..
నగదు తీసుకోవద్దు:పండగల వేళ నగదు అవసరాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డును వినియోగించకూడదు. కార్డులతో నగదును తీసుకుంటే.. దానికి అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. పైగా.. దీనికి అదనపు సమయమూ ఉండదు. మీరు డబ్బు తీసుకున్న మరుక్షణం నుంచే వడ్డీ ప్రారంభం అవుతుంది. వడ్డీతోపాటు, ఇతర రుసుములనూ భరించాల్సి వస్తుంది. కాబట్టి, వీలైనంత వరకూ డబ్బు కోసం కార్డును వాడొద్దు.
కనీస మొత్తం చెల్లిస్తూ: క్రెడిట్ కార్డు బిల్లులో కనీస మొత్తం చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఇది వెసులుబాటు మాత్రమే. కానీ... మొత్తం బాకీని చెల్లించినప్పుడు ఉండే ప్రయోజనాలు ఇక్కడ లభించవు. మీ కార్డు వాడకం నిష్పత్తి పెరిగడంతోపాటు, క్రెడిట్ స్కోరుపైనా ప్రభావం పడుతుంది. కనీస మొత్తం చెల్లించగా.. మిగిలిన బాకీపై వడ్డీ చెల్లించాల్సిందే. కాబట్టి, మొత్తం బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో కనీస బాకీకి మించి చెల్లించడం మంచిది. దీనివల్ల వచ్చే బిల్లులో వడ్డీ తగ్గుతుంది.
ఆలస్యం చేస్తే: పండగల వేళ కొనుగోళ్లు చేసినప్పుడు.. బిల్లులను సకాలంలో తీర్చే ఏర్పాటు చేసుకోండి. వ్యవధి తీరిన తర్వాత చెల్లిస్తే.. ఆలస్యపు రుసుము వర్తిస్తుంది. అంతేకాదు.. మీ క్రెడిట్ నివేదికలోనూ దీన్ని ప్రస్తావిస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఏదైనా రుణాలు తీసుకునేందుకు మీకు ఇబ్బందులు ఏర్పడవచ్చు. అందుకే, వ్యవధికి ముందుగానే బిల్లు చెల్లించేయడం ఉత్తమం.