ఇప్పటి వరకు ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ వెనక్కి నెట్టారు. ఆయా కంపెనీల రోజువారీ షేరు కదలికల్ని బట్టి మారే 'ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్' జాబితాలో 198.9 బిలియన్ డాలర్ల సంపదతో ఆర్నాల్ట్ తొలి స్థానంలో నిలిచారు. గురువారం ఒక్కరోజే ఆయన సంపద 0.39 శాతం ఎగబాకింది. ఈ జాబితాలో 194.9 బిలియన్ డాలర్లతో బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు. ఎలాన్ మస్క్ (185.5 బి.డా), బిల్ గేట్స్ (132 బి.డా), మార్క్ జుకర్‌బర్గ్ (130.6 బి.డా) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
'ఎల్వీఎంహెచ్' అనే కంపెనీకి బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రస్తుతం ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువుల బ్రాండ్లు ఈ కంపెనీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో అమెరికాకు చెందిన ఆభరణాల కంపెనీ టిఫనీ అండ్ కంపెనీని రూ.15.8 బిలియన్ డాలర్లకు లూయిస్ విట్టన్ సొంతం చేసుకోవడం వల్ల ఆర్నాల్ట్ షేర్ల విలువ భారీగా పెరిగింది.
72 ఏళ్ల ఆర్నాల్ట్ ఇప్పటికీ వ్యాపార కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఏళ్లుగా వివిధ మార్కెట్లను గమనిస్తూ సంపాదించిన అనుభవమే తన విజయానికి కారణమని ఆయన చెబుతుంటారు. ఈ ప్రయాణంలో తాను నేర్చుకున్న కొన్ని వ్యాపార పాఠాల్ని ఓ సందర్భంలో పంచుకున్నారు. అవేంటో చూద్దాం..
దీర్ఘకాల వ్యూహం..
ఆర్నాల్ట్ 1991లో తొలిసారి చైనాకు వెళ్లారు. అప్పటికి ఆయనకు అక్కడ ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయినా.. బీజింగ్‌లో ఆయన లగ్జరీ వస్తువులకు పెట్టింది పేరైనా లూయిస్ విట్టన్ స్టోర్‌ను తెరిచారు. ప్రస్తుతం చైనాలో అత్యంత విలాసవంతమైన వస్తువుల బ్రాండ్‌గా లూయిస్ విట్టన్ అవతరించింది. 25 ఏళ్లుగా తాము అత్యంత నాణ్యతతో కూడిన వస్తువుల తయారీ కోసం శ్రమిస్తూనే ఉన్నామని ఆర్నాల్ట్ ఓ సందర్భంలో తెలిపారు.