ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కొవిడ్-19 బాధితులకు త్వరగా ఉపశమనం కలిగించే దివ్యౌషధంగా భావిస్తున్న 2-డీజీ (2-డీయోగ్జి-గ్లూకోజ్) కి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనదేశానికి చెందిన మరిన్ని ఔషధ కంపెనీలకు బదిలీ చేయాలని డీఆర్‌డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) భావిస్తోంది. ఈ మేరకు ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులు (ఈఓఐ) ఆహ్వానించింది. కొవిడ్-19 బాధితులకు 2-డీజీ ఔషధాన్ని ఇచ్చినప్పుడు, వారిలో వైరస్ వృద్ధి ఆగిపోయి త్వరలో కోలుకునే అవకాశం ఉందని క్లినికల్ పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. కొవిడ్-19 బాధితులకు దీన్ని వినియోగించడానికి భారత్ ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) నుంచి అత్యవసర అనుమతి కూడా లభించింది. క్లినికల్ పరీక్షల నిర్వహణ, ఔషధ తయారీ.. తదితర అంశాల్లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఇప్పటికే డీఆర్‌డీఓతో కలిసి పనిచేస్తోంది. ప్రయోగాత్మక ఉత్పత్తి దశ పూర్తిచేసి, వాణిజ్య ప్రాతిపదికన 2-డీజీ మందును దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్టర్ రెడ్డీస్ సన్నాహాలు చేస్తోంది. ఈ మందును వైద్యుల చిట్టీ (డాక్టర్ ప్రిస్క్రిప్షన్) ప్రకారం ఆసుపత్రులకు మాత్రమే సరఫరా చేస్తారు. మరికొన్ని దేశీయ ఔషధ కంపెనీలకూ 2-డీజీ ఔషధాన్ని ఉత్పత్తి చేసే అవకాశాన్ని కల్పించాలని డీఆర్‌డీఓ నిర్ణయించింది. దీనివల్ల దేశీయంగా పెద్దఎత్తున ఈ ఔషధాన్ని ప్రజలకు అందించే అవకాశం ఉంటుందని, ఎగుమతులు సైతం చేపట్టవచ్చనేది డీఆర్‌డీఓ ఆలోచన. ఈ ఔషధంపై పరిశోధనా కార్యకలాపాలు విస్తృత స్థాయిలో కొనసాగించేందుకూ అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
ఈ అర్హతలుంటే..
ఈ ఔషధానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందాలనుకునే ఔషధ కంపెనీలకు డీఆర్‌డీఓ కొన్ని అర్హతలు నిర్దేశించింది. సంబంధిత ఫార్మా కంపెనీకి ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్) ఉత్పత్తి చేసే యూనిట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ- జీఎంపీ) సర్టిఫికేషన్ ఉండాలి. సొంత ఆర్‌అండ్‌డీ సత్తా కలది అయి ఉండాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వెనువెంటనే అందిపుచ్చుకుని, నెలకు సుమారు 2,000 కిలోల మందు తయారు చేసి స్వల్పకాలంలోనే మార్కెట్‌కు అందించగలగాలి. ఆసక్తి కల ఔషధ కంపెనీలు ఈ నెల 17 వరకు డీఆర్‌డీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను పరిశీలించి తగిన కంపెనీలను ఎంపిక చేయనున్నారు.