తెలంగాణ

telangana

ETV Bharat / business

వృద్ధి, పెట్టుబడులు పెంచే సమతుల్య బడ్జెట్​: బ్యాంకర్స్ - బ్యాంకర్స్

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సమతుల్యంగా ఉందని... వృద్ధి, పెట్టుబడులను పెంపొందించే విధంగా కనిపిస్తుందని బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.8 శాతంగా ఉన్న ఆర్థికలోటును, వచ్చే ఏడాది 3.5 శాతానికి కట్టడి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

Bankers say balanced budget to spur growth, draw in investment
వృద్ధి, పెట్టుబడులు పెంచే సమతుల్య బడ్జెట్​: బ్యాంకర్స్

By

Published : Feb 2, 2020, 5:44 AM IST

Updated : Feb 28, 2020, 8:37 PM IST

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సమతుల్యంగా ఉందని బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు. ఆర్థిక మందగమనం నుంచి కోలుకోవడానికి... వృద్ధిని, పెట్టుబడులను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.8 శాతంగా ఉన్న ఆర్థికలోటును, వచ్చే ఏడాది 3.5 శాతానికి కట్టడి చేస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

దీర్ఘకాలిక ప్రభావం

నిర్మలమ్మ బడ్జెట్​ను ఎస్​బీఐ ఛైర్మన్​ రజనీష్​ కుమార్​ స్వాగతించారు. బడ్జెట్ ప్రతిపాదనలు మెరుగైన కనెక్టివిటీతో కూడిన మౌలిక సదుపాయాల కల్పనకు ఉపకరిస్తాయన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య.. సామాన్యులకు అందుతాయని... ఈ రెండూ దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తాయని అభిప్రాయపడ్డారు.

మినహాయింపులు లేని కొత్త ఆదాయపు పన్ను విధానం వల్ల పన్నుల విధానంలో అయోమయం తొలగుతుందని, వ్యవస్థ సరళీకృతమవుతుందని రజనీష్ పేర్కొన్నారు. బ్యాంకు డిపాజిట్లపై బీమా పరిమితిని రూ.5 లక్షలకు పెంచడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

ఎన్​బీఎఫ్​సీలకు సర్ఫేసీ నిబంధనలు సడలించడం వల్ల ఈ రంగంలో మెరుగైన రికవరీ సాధ్యమవుతుందని రజనీష్ అన్నారు. రుణగ్రహీతలు తమ రుణాలు చెల్లింపులు (క్రమశిక్షణతో) చేయడానికి వీలు ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద బడ్జెట్​ గణాంకాలు వాస్తవికంగా ఉన్నాయని... ఆర్థికలోటు తగ్గింపు లక్ష్యం వల్ల అభివృద్ధి సాధనకు మార్గం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వాస్తవికంగా ఉన్నాయ్!

ఈ ఏడాది ఉన్న ఆదాయ కొరతను సరిగ్గా గుర్తించిన బడ్జెట్ గణాంకాలు నమ్మదగినవిగా ఉన్నాయని హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు చీఫ్​ ఎకనామిస్ట్ అభీక్ బారువా అన్నారు.
2021 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం మూలధన వ్యయం పెంచడం, వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకు కేటాయింపులు పెరగడం సానుకూల అంశమని అభీక్ అన్నారు. అయితే ప్రభుత్వ వ్యయాలు పెంచడం, ఆదాయపు పన్ను తగ్గించడం అనేవి... ప్రస్తుత మందగమనాన్ని అధిగమించేందుకు సరిపోయేంత పెద్ద ఆర్థిక ఉద్దీపనేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

"విదేశీ పెట్టుబడిదారులకు, ప్రత్యేకంగా సావరిన్ వెల్త్ ఫండ్లకు ఇచ్చే పన్ను మినహాయింపులకు... దేశీయ పొదుపు సరఫరా, వేగవంతమైన వృద్ధికి అవసరమైన మూలధనం మధ్య ప్రాథమిక అసమతుల్యత ఉందని గుర్తించాలి. ఇంతకంటే కూడా డివిడెండ్ పంపిణీ పన్ను రద్దు.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడుతుంది. "- అభీక్ బారువా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు చీఫ్​ ఎకనామిస్ట్

సమతుల్యంగా ఉంది!

బడ్జెట్​.... మీడియం టెర్మ్​లో ఆర్థిక వృద్ధి లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన సమతుల్యం కలిగి ఉందని స్టాండర్డ్​ చార్టర్డ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జరీన్ దారువాలా అభిప్రాయపడ్డారు.

బడ్జెట్​లో ఆర్థికలోటును వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతానికి కట్టడి చేయాలని పెట్టుకున్న లక్ష్యం.. ఆర్థిక ఏకీకరణ లక్ష్యాన్ని పునరుద్ఘాటించిందని ఎస్​ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ రవ్నీత్ గిల్ అన్నారు. అలాగే మూలధన వ్యయ నిష్పత్తిని జీడీపీలో నాలుగేళ్ల గరిష్ఠ స్థాయి 1.8 శాతానికి పెంచడం... ప్రైవేటు పెట్టుబడులు పెరగడానికి దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎఫ్​ఆర్​బీఎమ్​ చట్టం 2020-21 ఆర్థిక సంవత్సరాలకు అందించే 50 బీపీఎస్ పాయింట్ల మార్గాన్ని అనుసరిస్తుందని.. ఇది సమగ్ర వృద్ధి లక్ష్యాలపై బడ్జెట్​ దృష్టి సారించడాన్ని ధ్రువీకరిస్తుంని ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన బి. ప్రసన్న వ్యాఖ్యానించారు.

డిమాండ్, వృద్ధిని పునరుద్ధరించే లక్ష్యంతో బడ్జెట్ రూపొందించారని బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏకే దాస్​ అన్నారు.

ప్రోత్సాహకరంగా ఉంది!

బడ్జెట్​ కీలక రంగాలకు ప్రాధాన్యత, ప్రోత్సాహం అందించే విధంగా ఉందని, కొత్త ప్రయోగాలు చేయడానికి అవకాశం కల్పించే విధంగా ఉందని సిండికేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర అభిప్రాయపడ్డారు.

పెట్టుబడుల ఉపసంహరణ మంచిదే!

ఎల్​ఐసీ, ఐడీబీఐ బ్యాంకు వాటాల అమ్మకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం... సరైన చర్యని స్టాన్​చార్ట్​కు చెందిన దారువాలా అభిప్రాయపడ్డారు. దీని ద్వారా పన్నేతర ఆదాయాన్ని పెంచుకొని... తన పెట్టుబడులు పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు.

డిమాండ్ పెంచుతుంది

వినియోగం పెంచడానికి, సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని బడ్జెట్ ప్రతిబింబిస్తోందని డీబీఎస్ బ్యాంకు ఇండియాకు చెందిన సురోజిత్ షోమ్ అన్నారు. ఆదాయపు పన్ను రేట్ల సవరణ, వ్యక్తులు తమకు నచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం కల్పించడం.. వినియోగ వ్యయాన్ని ప్రోత్సహించడానికి, డిమాండ్ పెరగడానికి దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఊహలు... తుస్సు మన్నాయ్​!

బడ్జెట్​లో అనేక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తున్నా... ఏ ఒక్క రంగానికీ సరైన కేటాయింపులు చేయలేదని కోటక్ మహీంద్రాకు చెందిన శాంతి ఏకాంబరం అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు భారీ ప్రోత్సాహం ఉంటుందని భావించాం.. కానీ వివరాల్లోకి వెళ్తే పూర్తి డొల్లతనం కనిపిస్తోందన్నారు. కీలకమైన వ్యవసాయ రంగంతో సహా గ్రామీణ ఆర్థికవ్యవస్థకు కేవలం కంటితుడుపు కేటాయింపులు మాత్రం దక్కాయని ఆమె అన్నారు.

డిపాజిట్​ ఇన్సూరెన్స్​ను రూ.5 లక్షలకు పెంచడం బ్యాంకింగ్ డిపాజిటర్లలో విశ్వాసాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తుందని బంధన్ బ్యాంక్​కు చెందిన చంద్రశేఖర్ ఘోష్ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: ప్రధాని మోదీ భద్రతకు బడ్జెట్​లో రూ.600 కోట్లు

Last Updated : Feb 28, 2020, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details