Bank Strike News: రెండు బ్యాంక్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. మొత్తంగా తొమ్మిది యూనియన్లతో కూడిన ఉండే ఈ ఫోరం డిసెంబర్ 16 నుంచి రెండు రోజుల స్ట్రైక్ చేయాలని నిర్ణయించింది.
బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)ను ప్రైవేటీకిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా తాము ఈ సమ్మె చేపడుతున్నట్లు పేర్కొంది యూఎఫ్‌బీయూ.
పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా 2019లో ఐడీబీఐ బ్యాంక్‌లోని మెజార్టీ వాటాను ఎల్ఐసీకి విక్రయించింది. ఇలా నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది. బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదింపచేయడానికి కేంద్ర ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని యూఎఫ్‌బీయూ నిర్ణయించినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ఈ మేరకు డిసెంబర్ 16, 17 తేదీల్లో సమ్మెకు దిగుతున్నట్లు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేసేలా ఉందని ఆయన అన్నారు.
ఇదీ చూడండి:మారిన బ్యాంక్ రూల్స్.. కొత్త నిబంధనలు ఇవే..