దేశీయంగా విమాన సర్వీసులు మార్చి 25 నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. ఏప్రిల్ 14 లాక్‌డౌన్ వరకు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నియంత్రణ సంస్థ డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్), తదుపరి ఆదేశాలు ఇచ్చాకే పునఃప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. అంటే లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అనుసరించే, డీజీసీఏ ఆదేశాలుంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఏప్రిల్ 15 నుంచి బుకింగ్‌లను కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రారంభించాయి. సామాజిక దూరం పాటించాల్సి ఉంది కాబట్టి విమానాల్లో 3 సీట్ల వరుస ఉంటే, మధ్యసీటును ఖాళీగా ఉంచుతామని చెబుతున్నాయి.
గరిష్ఠంగా ఏడాది లోపు ప్రయాణించాలి
మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 లోపు ప్రయాణానికి ముందస్తుగా టికెట్ కొనుగోలు చేసుకున్న వారికి, లాక్‌డౌన్ కారణంగా విమానాలు రద్దయ్యాయి. మరి టికెట్ సొమ్ము మాటేంటి అంటే.. వాపసు కావాలంటే, నిబంధనలకు అనుగుణంగా రద్దు చేసుకుంటే, ఒక్కో టికెట్‌పై రూ.3,000 వరకు మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఇస్తామని సంస్థలు పేర్కొంటున్నాయి. అలా కాకుండా ప్రయాణతేదీ మార్చుకుంటే ఆ నగదు సద్వినియోగం అవుతుంది. టికెట్ ఎవరి పేరిట బుక్ అయిందో, ఆ వ్యక్తి పీఎన్‌ఆర్‌లోనే ఆమొత్తం నగదును ‘క్రెడిట్‌షెల్’ పేరిట సంస్థలు నిల్వ ఉంచుతున్నాయి. ప్రయాణికుడి పేర క్రెడిట్‌షెల్ ఏర్పాటైన ఏడాది వరకు, అదే వ్యక్తి ప్రయాణానికి దీన్ని వాడుకోవచ్చు. కానీ ప్రయాణతేదీ మార్పు రుసుం (రీషెడ్యూల్ ఫీ) ఉండదు కానీ, టికెట్ ధరలో మార్పు ఉంటే, ఆ మొత్తం చెల్లించాల్సి వస్తుంది.
ప్రయాణికులు తప్పనిసరిగా పరిశీలించుకోవాలి
విమానయాన సంస్థలు లాక్‌డౌన్ కారణంగా విమానాన్ని రద్దు చేస్తే, నేరుగా ప్రయాణికుల పీఎన్‌ఆర్‌లోనే క్రెడిట్‌షెల్‌లో, టికెట్ మొత్తాన్ని వేస్తున్నాయి. ఆయా సంస్థల వెబ్‌సైట్‌లో ‘మై బుకింగ్’/ఎడిట్ బుకింగ్‌లో పీఎన్‌ఆర్ రిట్రీవ్‌లోకి వెళ్లి, పీఎన్‌ఆర్ స్టేటస్‌ను తప్పక పరిశీలించుకోవాలి. అందులో మనం చెల్లించిన మొత్తం ఉంటుంది. ఏజెంట్ ద్వారా బుక్ చేసుకుంటే, వారి సాయంతో అయినా పరిశీలించుకోవచ్చు.
* కరోనా వల్ల మే వరకు ప్రయాణతేదీ మార్చుకోవాలన్నా, వీలు కల్పిస్తున్నాయి. ఆరోజు నుంచి క్రెడిట్‌షెల్ అమల్లోకి వస్తుంది.
* ఏప్రిల్ 15 నుంచి విమాన ప్రయాణాలపై మాత్రం డీజీసీఏ ప్రకటన వచ్చాకే స్పష్టత వస్తుందని సంస్థల ప్రతినిధులు తెలిపారు.