కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా యువత ఆలోచనల్లో ఉద్యోగం విషయంలో చాలా మార్పులు వచ్చాయి. సంక్షోభం కారణంగా ప్రైవేటు సంస్థల్లో భారీగా ఉద్యోగాలు, వేతనాల కోతలు విధించిన నేపథ్యంలో.. చాలా మంది ప్రభుత్వ కొలువే శ్రీరామ రక్షగా భావిస్తున్నట్లు ఓ సర్వేలో తెలిసింది.
పోటీ పరీక్షల ప్లాట్ఫాం 'అడ్డా247' ఈ సర్వే చేసింది. 6,500 మంది యువత (18 నుంచి 30 ఏళ్ల వయస్సు) ఈ సర్వేలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 10 ప్రధాన పట్టణాల్లో సర్వే నిర్వహించగా.. ఇందులో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారు పాల్గొనడం గమనార్హం.
ఎక్కువ వేతనం, ఉద్యోగ భద్రత కారణాలతో చాలా మంది ప్రభుత్వ కొలువులకే దరఖాస్తులు చేయడం, అందుకు సన్నద్ధమవ్వడం వంటివి చేస్తున్నట్లు సర్వే తెలిపింది. కరోనాకు ముందూ ఈ ధోరణి ఉన్నా.. ఇటీవల మరింత ఎక్కువైనట్లు పేర్కొంది.
సర్వేలో ముఖ్యాంశాలు..
- ప్రభుత్వ ఉద్యోగాల డిమాండ్ దిల్లీలో ఎక్కువగా ఉంది. ఇక్కడ సర్కారీ కొలువే నయమనుకునే యువత 11.04 శాతం ఉండగా ... ఆ తర్వాతి స్థానంలో పట్నా (11.03 శాతం) ఉంది.
- సర్వేలో పాల్గొన్న వారిలో 64.77 శాతం మంది జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి కొలువుల్లో రెండింటికీ ప్రాధాన్యమిస్తున్నారు.
- 28 శాతం మంది జాతీయ స్థాయి ఉద్యోగాలవైపే మొగ్గుచూపుతున్నారు. 6.5 శాతం మంది రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలనే ఇష్టపడుతున్నారు.