తెలంగాణ

telangana

ETV Bharat / business

'2022లో స్థిరాస్తి, బ్యాంకులు రాణిస్తాయ్‌' - అన్షుల్ సైగల్

Anshul Saigal kotak: వచ్చే ఏడాది స్థిరాస్తి, బ్యాంకింగ్ రంగాలు రాణిస్తాయని కోటక్ మహీంద్రా ఏఎంసీ పోర్ట్​ఫోలియో మేనేజర్ అన్షుల్ సైగల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాదిలో 10 శాతం అటూ, ఇటుగా కదలాడే అవకాశం ఉందని చెప్పారు. ఒమిక్రాన్‌ ఆందోళనలు మార్కెట్‌పై ఎంత ప్రభావం చూపుతాయో తెలియాల్సి ఉందన్నారు.

ANSHUL INTERVIEW
ANSHUL INTERVIEW

By

Published : Dec 19, 2021, 7:54 AM IST

Anshul Saigal kotak: స్థిరాస్తి, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, భారీ యంత్ర పరికరాల షేర్లు నూతన సంవత్సరంలో రాణించే అవకాశం ఉందని కోటక్‌ మహీంద్రా ఏఎంసీ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌, హెడ్‌ ఆఫ్‌ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ అన్షుల్‌ సైగల్‌ అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఆందోళనలు మార్కెట్‌పై ఎంత ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సి ఉందని, ఇటీవల వచ్చిన ర్యాలీ నేపథ్యంలో ప్రస్తుతం దిద్దుబాటు వస్తోందని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో ప్రస్తుత స్థాయి నుంచి మార్కెట్‌ 10 శాతం అటు ఇటుగా కదలాడొచ్చని వెల్లడించారు. ఇటీవల కొత్త తరం కంపెనీలు అధిక ధరల వద్ద ఐపీఓలకు వస్తున్న నేపథ్యంలో, మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సేవల్లో భాగంగా రూ.1,600 కోట్లకు పైగా ఆస్తుల్ని నిర్వహిస్తున్న సైగల్‌ 'ఇన్ఫామిస్ట్‌'కి ఇచ్చిన ఇంటర్య్వూలో పలు అంశాలపై మాట్లాడారు. ఆ విశేషాలు..

ఈక్విటీ మార్కెట్లపై కొవిడ్‌ ఒమిక్రాన్‌ ప్రభావం ఎంతమేరకు ఉండొచ్చు?

Omicron Effect on Stock market:కొవిడ్‌ కొత్త వేరియంట్లు ఏవొచ్చినా మొదటి, రెండు దశలతో పోలిస్తే పెద్దగా ఆందోళన కలిగించకపోవచ్చు. మార్కెట్లు కొంత ప్రభావానికి లోనవుతున్నా, కేవలం ఒమిక్రాన్‌ వల్లే అని నేను అనుకోను. కొంతకాలంగా ర్యాలీ వచ్చిన నేపథ్యంలో మార్కెట్లలో స్థిరీకరణ చోటు చేసుకుంటోంది. షేర్ల విలువలు అధికంగా ఉండటంతో, మార్కెట్లు ఇంకా పైకి వెళ్లేందుకు అవకాశం లేదు. కొంత దిద్దుబాటు జరగాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతోందని నేను భావిస్తున్నా.

యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపునకు దిగితే వర్ధమాన మార్కెట్ల పరిస్థితి ఎలా ఉండబోతోంది?

US fed effect on Indian market:దీని గురించి చెప్పాలంటే 2003-08కి వెళ్లాలి. 2003లో యూఎస్‌ ఫెడ్‌ రేట్ల పెంపును ప్రకటించింది. అప్పట్లో 1 శాతం ఉన్న వడ్డీ రేటు 2007 చివరకు క్రమంగా 5 శాతానికి చేరింది. అయితే సెన్సెక్స్‌ మాత్రం 3,000 పాయింట్ల నుంచి 21,000 పాయింట్లకు చేరింది.. అంటే ఈ రెండింటికీ నేరుగా సంబంధం లేదని అర్థమవుతోంది కదా! వడ్డీ రేట్లు వచ్చే ఏడాదిలో 3సార్లు పెంచితే కొంత ప్రభావం తప్పదు. క్రమంగా వడ్డీ రేట్లు పెంచితే మార్కెట్లపై దీర్ఘకాలంలో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు.

2022లో ఏ రంగాలు బాగుండే అవకాశం ఉంది?

Market Outlook 2022:స్థిరాస్తి రంగం బాగుంటుంది. రుణ వృద్ధి వచ్చే ఏడాది పుంజుకుంటుందని అనుకుంటున్నా. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లను కూడా గమనించొచ్చు. మూలధన వ్యయాలు పెరిగే అవకాశం ఉండటంతో భారీ యంత్ర పరికరాల షేర్లకు కూడా కలిసిరావొచ్చు. ఫార్మా కంపెనీలు దిద్దుబాటుకు లోనై ఆకర్షణీయ విలువలకు చేరాయి. వీటిపై కూడా మదుపర్లు దృష్టి సారించొచ్చు. రసాయనాలు, తయారీ రంగాలు కూడా వచ్చే ఏడాది రాణించొచ్చు.

కొన్ని నెలలుగా విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) విక్రయాలకు దిగుతోంటే, డీఐఐలు కొనుగోళ్లు చేస్తున్నారు. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?

ఎఫ్‌ఐఐల ట్రేడ్‌లు దేశీయ మదుపర్ల ట్రేడ్ల కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. వచ్చే కొన్నేళ్లలో భారత్‌ సాధించబోయే వృద్ధిని చూసి విదేశీ మదుపర్లు తిరిగి మన మార్కెట్లలోకి పెట్టుబడులు చొప్పించడం ఖాయం.

2022లో మార్కెట్లు ఎక్కడ ఉండొచ్చు?

ప్రస్తుత స్థాయి నుంచి 10 శాతం అటు ఇటుగా కదలాడొచ్చు.

చిన్న, మధ్య స్థాయి షేర్లు పెద్ద వాటితో పోలిస్తే బాగా పెరిగాయి కదా.. ఇంకా పెరిగే అవకాశం ఉందా?

కొన్ని షేర్లకు అవకాశం ఉంది. భవన నిర్మాణ సామగ్రిలో ఉన్న కంపెనీలు ఆకర్షణీయంగా ఉన్నాయి. స్థిరాస్తి రంగం పుంజుకుంటుండటంతో ఈ రంగంలోని షేర్లను కూడా గమనించొచ్చు. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సేవల కంపెనీలు కూడా మంచి ప్రతిఫలం అందించే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఒత్తిళ్ల నుంచి బయటకొచ్చి, మంచి పనితీరు కనబరుస్తున్నందున, వీటిని కూడా కొనుగోలు చేయొచ్చు.

ఇటీవల ఐపీఓలు వరుస కడుతున్నాయి. దీన్ని ఎలా చూస్తారు?

ఐపీఓలపై జాగ్రత్తగా ఉన్నాం. కంపెనీ మూలాలు తెలియకుండా కొత్తగా పెట్టుబడులు పెట్టే మదుపర్లు దూకుడుగా డబ్బులు పెట్టి ఇబ్బందులు పడొద్దు. కొత్త తరం కంపెనీలు చాలా వరకు అధిక ధరల వద్ద ఐపీఓలకు వస్తున్నాయి. భవిష్యత్‌లో వీటి పని తీరు ఎలా ఉంటుందో అంచనా వేయడం కొంచెం కష్టమే. కొన్ని కంపెనీలు మంచి నమోదు లాభాలు అందిస్తున్నాయని, ప్రతి ఐపీఓ వెంట పడకుండా మదుపర్లు అప్రమత్తంగా ఉండాలి.

ఇదీ చదవండి:'వియత్నాంలో పిల్లలకు కొవాగ్జిన్​​'పై భారత్​ బయోటెక్ చర్చలు!

ABOUT THE AUTHOR

...view details