ఐఫోన్... ఇన్నాళ్లుగా ఈ ఫోన్‌ను క్రాక్ చేయడమంటే ఎంతటి కొమ్ములుతిరిగిన హ్యాకర్లకైనా అసాధ్యమనే భావన ఉండేది. కానీ నేడు ఆ భ్రమలు తొలిగిపోయాయి. హ్యాకర్లు క్షణాల్లోనే ఐఫోన్లను ఛేదించి విలువైన సమాచారాన్ని రాబట్టగలుగుతున్నారు. అదే సమయంలో ఆండ్రాయిడ్ ఫోన్లను క్రాక్ చేయడం మాత్రం వారికి కష్టమైపోతోంది. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజంగానే నిజం.
వ్యక్తిగత 'గోప్యత' పేరుతో
యాపిల్ ఐఫోన్లలో సెక్యూరిటీ చాలా కఠినంగా ఉంటుంది. దానిని ఛేదించడం సాధారణ హ్యాకర్ల వల్ల కాదు. అందుకే ఉగ్రవాదులు వాటిని ఎక్కువగా వాడుతుంటారు. ఫలితంగా ప్రభుత్వాలు ఎంతో కష్టపడి ఉగ్రవాదులను పట్టుకున్నా, వారి ఫోన్లలో ఉన్న సమాచారాన్ని సేకరించడం, న్యాయస్థానాల్లో నిరూపించడం చాలా కష్టమైపోతోంది.
ఉగ్రవాదుల ఐఫోన్లలోని సమాచారాన్ని తమకు (బ్యాక్‌డోర్ విధానంతో) తెలియజేయాలని అమెరికా ప్రభుత్వం... యాపిల్‌కు ఎంత మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. తాము వినియోగదారుల 'వ్యక్తిగత గోప్యత'కు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, కనుక వారి సమాచారాన్ని ఇవ్వడం కుదరదని యాపిల్ తేల్చిచెప్పింది. ఇప్పటికీ అదే చెబుతోంది.
యాపిల్‌కు షాక్
యాపిల్ తీరుతో విసిగిపోయిన అమెరికా ప్రభుత్వం... నేరస్థుల ఐఫోన్లను ఛేదించడానికి అనేక సంస్థలతో ఒప్పందం చేసుకుంది. వీటిలో 'సెల్లెబ్రైట్' సంస్థ ఒకటి.
సెల్లెబ్రైట్ తగిన సాధనాలు ఉపయోగించి... ఐఫోన్లలోని జీపీఎస్ రికార్డులు, కాల్లాగ్లు, కాంటాక్టులతో సహా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ వంటి నిర్దిష్ట యాప్‌ల్లోని విలువైన సమాచారాన్ని కూడా సేకరించగలుగుతోంది. నిజానికి సెల్లెబ్రైట్ ఉపయోగించే క్రాకింగ్ సాధనం... అన్ని ఐఫోన్లను, లేటెస్ట్ మోడళ్లతో సహా ఛేదించగలదు.
ఆండ్రాయిడ్ దగ్గర పప్పులుడకవ్