"మా వినియోగదారుల సమాచారం ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతుంది. అంటే ఎవరూ తెలుసుకోలేరు. గోప్యతకు మేం పెద్దపీట వేస్తాం. సమాచారం తెలపలేం"
- వాట్సప్ (గతంలో స్పందన)
"దేశభద్రత, అత్యంత కీలకమైన సందర్భాల్లో సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత సామాజిక మాధ్యమ నిర్వాహకులకు ఉంటుంది. అలాంటి ఏర్పాటు ఇంతకుముందు లేకుంటే ఇకపై చేసుకోవాలి. సందేశంలో ఏముందో మాకు అవసరం లేదు. అదెక్కడి నుంచి వచ్చిందో (మూలం) చెబితే చాలు."
- కేంద్ర ప్రభుత్వం
దేశంలో కుర్రకారు నుంచి ముసలివాళ్ళ దాకా అందరికీ ఊతపదంగా.. ఊతంగా మారిన ‘వాట్సప్’ భవితవ్యం భారత్‌లో ఎలా ఉండనుంది? తన స్వీయ విధానాలతో రాజీ పడుతుందా? లేక భారత ప్రభుత్వంతో ఘర్షణ పడుతుందా? ఏమౌతుంది? సామాజిక మాధ్యమాల నిర్వహణ, నడవడికపై భారత ప్రభుత్వం గురువారం వెల్లడించిన నియమ నిబంధనలకు వాట్సప్ సంస్థ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఆ మెలికే కీలకం!
దేశభద్రత, సార్వభౌమత్వం, రక్షణ, ఇతరత్రా కీలకమైన అంశాలు, రేప్ కేసులు తదితర సందర్భాల్లో - వివాదాస్పద సందేశం మూలాల గురించి, అదెక్కడి నుంచి ఆరంభమైందో తెలియజేయటం సామాజిక మాధ్యమం బాధ్యత- అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదాహరణకు మీకు ఎవరి నుంచో వాట్సప్ మెసేజ్ వచ్చించదనుకోండి. అది దేశ సార్వభౌమత్వానికి విఘాతం కల్గించేలా, ప్రజల్లో సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందని ప్రభుత్వం భావిస్తే ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో ప్రభుత్వం ఆరాతీస్తుంది. అసలీ మెసేజ్ సృష్టికర్త ఎవరు? అనే విషయాన్ని ప్రభుత్వం అడిగితే చెప్పాల్సిన బాధ్యత వాట్సప్‌కుంటుంది.
అక్కడే వారికి చిక్కంతా!
వాట్సప్ తన వినియోగదారుల సందేశాలు, సంభాషణలను పూర్తి భద్రంగా ఉంచుతామని, ఎవ్వరికీ వెల్లడించమని, ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని చెబుతూ వస్తోంది. తద్వారా తమ వినియోగదారులకు పూర్తి ప్రైవసీ ఇస్తామంటోంది. అదే తమ విధానమని చెబుతూ వస్తోంది. 2018లోనే భారత ప్రభుత్వం ఇలాంటి సమాచారం అడిగితే కుదరదని చెబుతూ 'వినియోగదారుల ప్రైవసీ, భద్రతల విషయంలో మేం రాజీపడం. అలాంటి వివరాలిచ్చే అవకాశం మా వ్యవస్థలో లేదు' అని 2018లో వాట్సప్ తెగేసి చెప్పింది. దాంతో భారత ప్రభుత్వం కూడా సీరియస్‌గానే స్పందించింది. కీలకమైన సందర్భాల్లో ప్రభుత్వానికి సహకరించేలా, సమాచారం అందించేలా యంత్రాంగాన్ని మార్చుకోవాలని, పరిష్కార మార్గాలు కనుక్కోవాలని స్పష్టం చేసింది.
అంగీకరించకుంటే..
'సందేశంలో ఏముందో కాకున్నా, ఎక్కడి నుంచి తొలుత మొదలైందో, దీనికి ఆద్యులెవరో చెప్పాల్సిందే' అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం స్పష్టం చేయటం గమనార్హం! ఈ నేపథ్యంలో తాజా మార్గదర్శకాల విషయంలో వాట్సప్ ఎలా స్పందిస్తుందనేది దాన్ని బట్టే ఆ వేదిక భవితవ్యం భారత్‌లో ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలకు అంగీకరించని పక్షంలో నిషేధానికి గురయ్యే అవకాశం లేకపోలేదన్నది నిపుణుల మాట. ప్రభుత్వం గురువారం విడుదల చేసిన కొత్త నిబంధనలు యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లతో పాటు వాట్సప్‌కు కూడా వర్తించనున్నాయి. ఫేస్‌బుక్‌లాంటి సంస్థ తాము బాధ్యతగల సామాజిక మాధ్యమంగా ప్రవర్తిస్తామని.. భారత్‌తో తమకు సత్సంబంధాలున్నాయని ప్రకటించింది.
చేజారితే చేటే
వాట్సప్, ఫేస్‌బుక్‌లాంటి సామాజిక మాధ్యమాల ప్రైవసీలను నమ్ముకొని చేతికొచ్చినట్లు రాసేవారికీ తాజా మార్గదర్శకాలు కళ్ళెం వేయనున్నాయి. సున్నితమైన అంశాల్లో వ్యాఖ్యానించేప్పుడు, స్పందించేప్పుడు జాగ్రత్తపడటం మంచిది. ప్రభుత్వ నిబంధనల మేర ఆయా వ్యాఖ్యలు ఎవ్వరు చేసినా వారిని తవ్వితీస్తారు. సామాజిక మాధ్యమ వేదికలే ఆ వివరాలను ప్రభుత్వానికి ఇస్తాయి. కాబట్టీ ఇన్నాళ్లూ ఉందనుకున్న ప్రైవసీ రక్షణ ఇకపై సున్నిత అంశాల్లో ఉండదు.
ఇదీ చదవండి :పీఎస్‌బీల ప్రైవేటీకరణే మార్గం కారాదు!