హమ్మయ్య!!.. ఎయిర్ ఇండియా విక్రయ ప్రక్రియ కొలిక్కి వచ్చాక ప్రభుత్వం లోలోన అనుకున్న మాట ఇదేనేమో. రూ.60,000 కోట్లకు పైగా రుణభారం ఉన్న సంస్థను అమ్మేందుకు ప్రభుత్వం 2017 నుంచి పలుమార్లు ప్రయత్నించి, ఇప్పటికి సఫలమైంది. రూ.18,000 కోట్లతో ఎయిర్ ఇండియాను మళ్లీ టాటా గ్రూపు సొంతం చేసుకుంది. ఈ ఏడాది చివరికల్లా టాటాలకు యాజమాన్య బదిలీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసే అవకాశం ఉంది. తదుపరి ఎయిర్ ఇండియా ప్రయాణం టాటాల నేతృత్వంలో మొదలుకానుంది. ఆ లోగా ఎయిర్ ఇండియాను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అవసరమైన కార్యాచరణ, ప్రణాళిక, సమర్థ వ్యూహాలతో టాటా గ్రూపు సిద్ధమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
కొవిడ్-19 పరిణామాలే తొలి సవాలు
కొవిడ్-19 మొదటి, రెండో దశ పరిణామాల ప్రభావం నుంచి విమానయాన రంగం ఇప్పటికీ పూర్తిగా తేరుకోలేదు. కొవిడ్ మూడో విడతకు అవకాశాలున్నాయనే హెచ్చరికలు వస్తున్నాయి. బ్రిటన్, రష్యా వంటి దేశాల్లో కొవిడ్-19 కొత్త కేసులు, మరణ వార్తలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. అందువల్ల కొవిడ్ పరిణామాల ప్రభావం నుంచి ఎయిర్ ఇండియాను ఒడ్డుకు చేర్చేందుకే టాటాలకు సమయం పట్టొచ్చని, ఆ తర్వాతే సంస్థలో ఇతర సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీర్ఘకాలిక ప్రణాళికతోనే ఎయిర్ ఇండియాకు మేలు జరుగుతుంది కానీ, స్వల్పకాలిక ఉపశమన చర్యలు, ప్రణాళికల అమలుతో ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు.
కొత్త విమానాలకు రూ.7500 కోట్లు!
ఒకప్పుడు ఎయిర్ ఇండియా విమానాలు మహారాజా మస్కట్‌తో ఎంతో సౌకర్యవంతంగా సేవలందించేవి. 2000 మధ్య నుంచి క్రమంగా ఎయిర్ ఇండియా వైభవం తగ్గుతూ వచ్చింది. అప్పులు, ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. సమయపాలన సరిగా లేక ప్రయాణికులకు, జీతాల ఆలస్యంతో ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరమ్మతుల కోసమే ఆకస్మికంగా విమానాలను నిలిపేసిన రోజులూ ఉన్నాయి. రాకపోకలు సజావుగా సాగేందుకు ఎయిర్ ఇండియా ప్రస్తుతమున్న విమానాలను నవీకరించాలని, ఇందుకు రూ.7500 కోట్లకు పైగా పెట్టుబడి అవసరం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. సిబ్బందికి అదనపు శిక్షణతోనే కార్యకలాపాలు-సేవలపరంగా ప్రైవేట్ విమానయాన సంస్థలతో ఎయిర్ ఇండియా పోటీపడగలిగి, విపణిలో మెరుగైన వాటా సాధించే అవకాశం ఉంటుంది.
అనుకూలాంశాలున్నాయ్
- కొవిడ్-19 పరిణామాల తర్వాత నాన్ స్టాప్ సర్వీసులకు డిమాండు పెరగడం ఎయిర్ ఇండియాకు సానుకూలాంశం. ప్రస్తుతం భారత్ నుంచి విదేశీ గమ్యస్థానాలకు నాన్‌స్టాప్ సర్వీసుల విషయంలో విదేశీ విమానయాన సంస్థలకు అధిక వాటా ఉంది. ఎయిర్ ఇండియా వాటా 19.3 శాతమే. తనకున్న స్లాట్లతో సర్వీసులు పెంచుకుని, సేవలను మెరుగుపర్చుకుంటే మార్కెట్ వాటా పెంచుకోవచ్చని, లాభార్జనకు దోహదం చేస్తుందని విశ్లేషిస్తున్నారు.
- టాటా బ్రాండుపై ఉన్న విశ్వసనీయత, అనుభవజ్ఞులైన నిపుణుల అండదండలతో ఎయిర్ ఇండియా తిరిగి గాడిలో పడటం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడుతున్నారు.
- ఆతిథ్య రంగంలో టాటా గ్రూపునకు విశేష అనుభవం ఉంది. తాజ్ హోటల్స్ బ్రాండుతో టాటాలు రాణిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. ఈ పేరు- ప్రతిష్ఠలు, సిబ్బంది, సేవల నాణ్యత లాంటివి ఎయిర్ ఇండియాకు అనుకూలించే అంశాలు.
- విస్తారా, ఎయిరేషియా ఇండియాల్లోనూ టాటా గ్రూపునకు వాటాలున్నందున.. ఆ సంస్థల్లోని భాగస్వాముల అనుభవం కూడా ఎయిర్ ఇండియాను తిరిగి గాడిలో పెట్టేందుకు టాటాలు వాడుకోవచ్చు.
- 3 విమానయాన సంస్థలు టాటాల ఆధీనంలో ఉండటం వల్ల.. విమాన తయారీ సంస్థలు, ఇంజిన్ల తయారీదార్లు, విమానాల లీజుదార్లు, విమానాశ్రయాల నిర్వాహకులు, ఇంధన కంపెనీలతో 'బేరమాడే' శక్తి లభించవచ్చు.
- ఎయిర్ ఇండియా కోసం నిధులను సమకూర్చుకోవడం, ప్రణాళికలు, వ్యూహాల రూపకల్పన-కార్యాచరణను సమర్థంగా పూర్తి చేయడంలో టాటా గ్రూపు చూపే సమర్థతే కీలకం కానుంది. ఉక్కు దగ్గర నుంచి ఐటీ సేవల వరకు ఎన్నో వ్యాపార సంస్థలను విజయవంతంగా నడిపిస్తున్న టాటా గ్రూప్, ఎయిర్ ఇండియా విషయంలో ఎలాంటి వ్యూహాలు పన్నుతుందో వేచి చూడాల్సిందే.
ఇదీ చూడండి :పెట్రోల్ ధరలు తగ్గేలా అంతర్జాతీయంగా మోదీ ప్రయత్నాలు!