అమెరికాకు చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా వచ్చే ఏడాది భారత విపణిలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ట్విటర్‌లో తెలిపారు. 'భారత్‌లో మీ ప్రణాళికల పురోగతి ఎక్కడ వరకు వచ్చింది' అన్న ప్రశ్నకు మస్క్ బదులిస్తూ.. వచ్చే ఏడాది కచ్చితంగా అడుగుపెడతామని తెలిపారు. అమెరికాకు చెందిన హార్లే డేవిడ్‌సన్, జనరల్ మోటార్స్ లాంటి సంస్థలు భారత్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించగా, ఫోర్డ్ కూడా ఇక్కడ సొంతంగా కార్యకలాపాలు నిర్వహించడం ఆపేసింది. మహీంద్రా అండ్ మహీంద్రాతో కలిసి ఏర్పాటు చేసిన సంస్థకు ఫోర్డ్ తన తయారీ ప్లాంటును, ఇతర ఆస్తులను విక్రయించింది. ఇలాంటి తరుణంలో టెస్లా భారత్‌లో అడుగుపెట్టాలని భావిస్తుండటం గమనార్హం.
వచ్చే ఏడాది భారత విపణిలోకి టెస్లా! - tesla latest news
భారత విపణిలోకి వచ్చే ఏడాది అడుగుపెట్టనున్నట్లు చెప్పారు అమెరికా ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్. అమెరికాకు చెందిన హార్లే డేవిడ్‌సన్, జనరల్ మోటార్స్ లాంటి సంస్థలు భారత్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన తరుణంలో టెస్లా భారత్‌లో అడుగుపెట్టాలని భావిస్తుండటం గమనార్హం.
అయితే భారత్‌లో అడుగుపెట్టే ప్రణాళికలపై టెస్లా సీఈఓ మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. జులైలో భారత్‌కు చెందిన ఓ ట్విట్టర్ వినియోగదారుడు 'మీ కంపెనీ భారత్‌లోకి ఎప్పుడు అరంగేట్రం చేస్తుంద'ని అడగగా.. త్వరలోనే ఉండొచ్చని భావిస్తున్నామని మస్క్ చెప్పారు. 2019 మార్చిలో ఓ సందర్భంలో చెబుతూ 'ఈ ఏడాది భారత్‌కు రావాలని మేం కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ సంవత్సరం కుదరకపోతే వచ్చే ఏడాది కచ్చితంగా అడుగుపెడతామ'ని అన్నారు. అదే ఏడాది జులైలో ఐఐటీ మద్రాస్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఒక ఏడాదిలోగా భారత్ విపణిలో టెస్లా అడుగుపెడుతుందని తెలిపారు. అయితే భారత్‌లోకి అడుగుపెట్టడం ఆలస్యం అవుతుండటంపై భారత్‌లో నిబంధనలే కారణమని ఆయన గతంలో ఓ సందర్భంలో పేర్కొనడం గమనార్హం. బెంగళూరులో పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పేందుకు కూడా టెస్లా సంప్రదింపులు జరుపుతోంది.