ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.6వేలు క్యాష్‌బ్యాక్ ప్రకటించింది. రెండు విడతల్లో ఈ మొత్తాన్ని ఖాతాదారుడికి జమ చేయనుంది. 2జీ కస్టమర్లను 4జీలోకి ఆకర్షించడంలో భాగంగా 'మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్' ప్రోగ్రామ్ కింద ఈ ఆఫర్‌ను ప్రకటించింది. వచ్చే నెల జియో నుంచి జియోఫోన్ నెక్ట్స్ వస్తున్న వేళ ఎయిర్‌టెల్ ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం.
రూ.12వేలలోపు ధర ఉన్న వివిధ బ్రాండ్లకు చెందిన 150 స్మార్ట్‌ఫోన్ మోడళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. క్యాష్‌బ్యాక్ కోసం కస్టమర్ ప్రతినెలా రూ.249, ఆ పై మొత్తంతో క్రమం తప్పకుండా 36 నెలల పాటు రీఛార్జి చేయాలి. అప్పుడు తొలి 18 నెలల తర్వాత రూ.2వేలు, 36 నెలల తర్వాత మిగిలిన రూ.4వేలు క్యాష్‌బ్యాక్ కింద ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో జమ చేస్తారు. ఏడాది పాటు ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. వీటితో పాటు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాల కింద వింక్ మ్యూజిక్, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఫ్రీ ట్రయల్‌ను కూడా పొందొచ్చు. తమకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవడంతో పాటు డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ భారత పౌరులు పొందాలన్న ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది.