వారమంతా వరుస లాభాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు వారాంతంలో నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 53.99 పాయింట్ల నష్టానికి 36,671.43 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి-సూచీ నిఫ్టీ 22.80 పాయింట్లు క్షీణించి 11,035.40 వద్దకు చేరింది.
ఈ వారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 607.62 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది.
ఇదీ కారణం
అంతర్జాతీయంగా బలహీన సంకేతాల కారణంగా ఐటీ, లోహ రంగాల్లో మదుపరులు అప్రమత్తత పాటించారు.
వృద్ధిరేటు అంచనాలు తగ్గిస్తూ ఐరోపా కేంద్ర బ్యాంక్ ప్రకటన చేసింది. చైనా ఎగుమతుల్లో క్షీణత అంతర్జాతీయంగా మదుపరుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది.
ఇంట్రాడే సాగిందిలా...
సూచీ | గరిష్ఠం | కనిష్ఠం |
సెన్సెక్స్ | 36,753.59 | 36,592.93 |
నిఫ్టీ | 11,049 | 11,008.95 |
లాభానష్టాల్లోనివివే...
సెన్సెక్స్‌లో టాటా మోటార్స్ నేడు అత్యధికంగా 3.99 శాతం నష్టం మూటగట్టుకుంది. ఈ వరుసలో హెచ్‌సీఎల్‌టెక్ 2.53 శాతం, టాటా స్టీల్ 2.43 శాతం, వేదాంత 2.02 శాతం, ఇన్ఫోసిస్ 1.48 శాతం, ఓఎన్జీసీ 1.38 శాతం నష్టపోయాయి.