ప్రాణాంతకమైన సార్స్ సీఓవీ-2 వైరస్ ముట్టడితో మానవాళి భయం గుప్పిట్లో చిక్కుకుంది. కొవిడ్-19 జబ్బు పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో పదిమందిలో ఎవరైనా తుమ్మినా, దగ్గినా అందరూ అనుమానస్పదంగా చూస్తున్నారు. ఇతర ప్రభుత్వాల మాదిరిగానే భారత ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మహమ్మారిని అరికట్టేందుకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి. కానీ, ముప్పు మన చుట్టూ పొంచి ఉంది. చైనా వంటి ఆర్థిక శక్తి ఈ వ్యాధికి బలవగా, ఇరాన్ అతలాకుతలమవుతోంది. కొవిడ్-19 తమను గట్టి దెబ్బ కొట్టకముందే భారత్‌తోపాటు, సార్క్ దేశాలు పూర్తి శక్తితో సంసిద్ధమయ్యాయి. కొవిడ్-19 భయం భారత్‌తోపాటు, ప్రపంచాన్ని కమ్మేసింది. అయితే, ప్రస్తుతం ప్రపంచానికి కరోనా వైరస్‌కన్నా, దానికి సంబంధించిన భయమే పెద్ద ముప్పు కలిగించేదిగా ఉంది. నల్లబజార్లు ఇప్పటికే మాస్కులు, సబ్బులు, కీటకనాశినులు తదితర కొత్తరకం సరకుల్ని చెలామణీలోకి తీసుకొచ్చాయి.
వ్యవసాయ రంగం
మానవాళి మనుగడకు వ్యవసాయమే కీలక ఆధారం. ప్రస్తుతం చాలా వరకు మన వ్యవసాయం నాణ్యమైన విత్తనాలపై, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘటిత విత్తన రంగంపై ఆధారపడి ఉంది. మానవ వనరులు, వ్యవసాయ కూలీల లభ్యత, విత్తనాలు, ఎరువులు వంటి వ్యవసాయ సంబంధ వస్తువులు స్వేచ్ఛగా తరలడంపై ఆహార ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. ఐరోపా సమాఖ్య తరహాలోనే అమెరికా సైతం తన సరిహద్దుల్ని మూసేసుకుంది. ప్రస్తుతం ప్రపంచమంతా వీసాల్ని రద్దు చేసి, ప్రజల ప్రయాణాలపై ఆంక్షల్ని విధిస్తోంది. పలు దేశాల్లో ప్రజలు బయటికొచ్చేందుకు భయపడుతున్నారు. జనసమ్మర్దంగా ఉండే ప్రదేశాల వైపే వెళ్లడం లేదు. వియత్నాం నుంచి ఇటలీ దాకా విద్యాసంస్థల్ని మూసేశారు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే వ్యవసాయ కూలీల అందుబాటు తక్కువగా ఉండేలా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో వ్యవసాయ కూలీల వేతనాలూ పెరిగే అవకాశం ఉంది. ఆహార పదార్థాల ఉత్పత్తి వ్యయాలు పెరగనున్నాయి. కోళ్ల రంగంలో ముప్పు మరింత అధికంగా ఉంది. కోడిమాంసం ధరలు దారుణంగా పడిపోయాయి. భయాందోళనలు పెరిగిన కారణంగా కోళ్ల ఫారాల్లో పని చేసేందుకు శ్రామికులు తిరస్కరిస్తున్నారు.
విత్తన రంగం
ప్రపంచ విత్తన రంగం సరఫరా వ్యవస్థ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్క దేశానికీ విత్తనాల విషయంలో సార్వభౌమత్వం లేదు. ఓడరేవుల్ని, విత్తనాల రవాణాను నిలిపి వేయడం వల్ల ఈ ఏడాదిలో వ్యవసాయ ఉత్పాదకతపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి, ఏప్రిల్ నెలలు విత్తనాలు వేసేందుకు అనువైనవి. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్, గోధుమ, బార్లీ, కూరగాయలు వంటివి ఈ సీజన్‌లోనే వేస్తారు. భారత్‌లో సైతం పంటల కాలం మొదలు కానుంది. విత్తనాలు లేకపోవడం, ఆలస్యంగా అందుబాటులోకి రావడం వంటి కారణాలతో రైతులు విత్తడంలో ఆలస్యం చేస్తే ఈ ఏడాది తదనంతర కాలంలో తీవ్రస్థాయిలో ఆహార కొరతతోపాటు, ఆహార ధరల ద్రవ్యోల్బణం సంభవించే అవకాశం ఉంది.