కరోనా ప్రభావంతో కుదేలైన భవన నిర్మాణాల పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. దీనికి అనుబంధంగా ఉండే దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించడంతో కార్యకలాపాలు మొదలవుతున్నాయి. కానీ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న స్థితిలో ప్రాజెక్టులు పూర్తి చేయడం, విక్రయించడం తమకు సవాలేనని నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రంగం మళ్లీ పుంజుకోవడానికి సుమారు రెండేళ్లు పట్టవచ్చని నిపుణుల అంచనా. కొనుగోలుదారులకు ఊతమిచ్చేలా ప్రభుత్వాలు పన్నులు, వడ్డీ రేట్లను తగ్గిస్తేనే కొంత కోలుకుంటుందని వారు సూచిస్తున్నారు.
కీలక మార్కెట్‌కు గడ్డు కాలం
నివాస గృహాలు, కార్యాలయ భవన నిర్మాణాలకు దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ కీలక మార్కెట్టు. రెండు విభాగాల్లో ఏటా రూ. 30-40 వేల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతాయని అంచనా. అనుబంధ పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఇందులో సుమారు 30 శాతం వరకు ఆదాయం లభిస్తుంది. ఇంత పెద్ద రంగానికి ప్రభుత్వ చేయూత చాలా అవసరమని ఆ రంగం ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
పుంజుకోవడానికి మరింత సమయం
"ఆర్థిక మాంద్యాన్ని మించిన ఉపద్రవం ఇది. నిర్మాణ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కొనుగోలుదారుడిని ఎంతగా ప్రోత్సహిస్తే అంత త్వరగా ఈ రంగం కోలుకుంటుంది. వివిధ రూపాల్లో ప్రభుత్వానికి ఆదాయమూ పెరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాయితీలతో ముందుకు రావాలి. వినియోగదారుడి దగ్గర నగదు చలామణి పెరగాలి. బ్యాంకుల రుణ విధానం సరళతరం కావాలి."