తెలంగాణ

telangana

ETV Bharat / business

సమ్మర్​ షాక్​: పెరగనున్న ఏసీల ధరలు! - ఈ ఏడాది ఏసీల విక్రయాలు వృద్ధి రెండింతలు

ఎండాకాలం వచ్చేసింది. ఏసీలు కొందామనుకునే వారికి షాకింగ్ న్యూస్. ఈ నెలాఖరులోపు ఏసీల ధరలు 5-8 శాతం వరకు పెంచాలని వాటి తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. ధరలు పెరిగినప్పటికీ ఈ ఏడాది ఏసీల విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదవుతుందని ఆయా కంపెనీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ACs price To hike in this month
ఏసీల ధరలు మరింత ప్రియం

By

Published : Mar 14, 2021, 3:26 PM IST

Updated : Mar 14, 2021, 4:24 PM IST

ఈ వేసవిలో ఎయిర్​ కండీషనర్లు (ఏసీ) మరింత ప్రియం కానున్నాయి. విడి భాగాల దిగుమతి భారం తగ్గించుకునేందుకు.. ప్రముఖ కంపెనీలన్నీ గృహ అవసరాలకు వినియోగించే ఏసీల ధరలు పెంచాలని భావిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం.

ధరలు పెంచినా.. ఈ ఏడాది ఏసీల విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదవ్వచ్చని వోల్టాస్​, డైకిన్​, ఎల్​జీ, ప్యానసోనిక్​, హాయర్​, బ్లూ స్టార్​, శాంసంగ్​ వంటి కంపెనీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎండా కాలంతో పాటు.. చాలా రంగాల్లో ఉద్యోగులు ఇంకా వర్క్​ ఫ్రం హోం చేస్తుండటం ఇందుకు కారణంగా చెబుతున్నాయి.

ధరలు ఎంత పెరగొచ్చంటే..

మార్కెట్ వర్గాల ప్రకారం.. ఏసీల ధరలు త్వరలో దాదాపు 5-8 శాతం పెరిగే అవకాశముంది. ఈ నెలాఖరులోపు 3-5 శాతం వరకు ధరలు పెంచాలని భావిస్తున్నట్లు డైకిన్ ఇప్పటికే ప్రకటించింది.

మరో దిగ్గజ సంస్థ ప్యానసోనిక్​ ఏసీలపై 6-8 శాతం, ఫ్రిజ్​లపై 3-4 శాతం వరకు ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపింది. గడిచిన నాలుగు నెలల్లో ఏసీల విక్రయాలు దాదాపు 25 శాతం పెరిగినట్లు ప్యానసోనిక్​ దక్షిణాసియా విభాగ సీఈఓ మనీశ్​ శర్మ వెల్లడించారు. వేసవిలోనూ ఆ వృద్ధిని కొనసాగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గ్రామీణ ప్రాంతాల డిమాండ్​..

ఈ వేసవిలో చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఏసీలకు మంచి డిమాండ్ ఉండొచ్చని కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పట్టణాలు, టౌన్లపై కరోనా ప్రభావం తక్కువగా ఉండటం, గత ఏడాది సరైన సమయానికి వర్షాలు పడటం, కరెంట్​ కోతలు లేకపోవడం వంటివి ఇందుకు తోడ్పడతాయని అంచనా వేస్తున్నాయి.

దేశంలో ఏటా దాదాపు 75 లక్షల వరకు ఏసీలు అమ్ముడవుతుంటాయి. దేశవ్యాప్తంగా 15కుపైగా కంపెనీలు ఏసీల వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి.

ఇది చదవండి:ఏప్రిల్ నుంచి పెరగనున్న టీవీల ధరలు!

Last Updated : Mar 14, 2021, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details