తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇకపై విమానం ఎక్కాలంటే ఇవి పాటించాల్సిందే.. - domestic flights resumption

మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్​పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ).. అన్ని విమానాశ్రయాలకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని(ఎస్​ఓపీ) జారీ చేసింది. ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది. ఆరోగ్యసేతు యాప్​ విషయంలో మాత్రం 14 ఏళ్ల లోపు పిల్లలకు మినహాయింపు ఇచ్చింది.

AAI issues SOP for domestic flights' resumption
మే 25 నుంచి విమాన సేవలు

By

Published : May 21, 2020, 11:27 AM IST

Updated : May 21, 2020, 1:13 PM IST

దేశీయ విమాన సర్వీసులు మే 25 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో భారత విమానాశ్రయాల సంస్థ (ఏఏఐ).. అన్ని విమానాశ్రయాలకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని(ఎస్​ఓపీ) జారీ చేసింది. విమానాశ్రయానికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు నిర్దేశిత నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

విమానాశ్రయాల్లో అనుసరించాల్సిన ప్రామాణిక నిబంధనలు:

ఆరోగ్యసేతు తప్పనిసరి:

  • ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది, ఎయిర్‌పోర్టు సిబ్బంది.. విమానాశ్రయాలకు వెళ్లేందుకుగాను స్థానిక ప్రభుత్వాలు ప్రజా రవాణా వ్యవస్థ, ప్రైవేటు టాక్సీలను అనుమతించాలి.
  • విమానాశ్రయంలోకి ప్రవేశించే మార్గం, కార్‌ పార్కింగ్‌ ప్రాంతాలన్నింటి వద్ద సీఐఎస్‌ఎఫ్​, పోలీసు నిఘాను కట్టుదిట్టం చేయాలి.
  • ప్రయాణికులు నిర్దేశించిన సమయం కంటే.. రెండు గంటలు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలి. విమాన ప్రయాణ సమయానికి నాలుగు గంటల ముందు వచ్చిన వారికి మాత్రమే టెర్మినల్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
  • ప్రయాణికులంతా.. తప్పని సరిగా ఆరోగ్య సేతు యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆరోగ్య సేతు యాప్‌లో గ్రీన్‌మార్క్‌ చూపితేనే ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ లోపలికి అనుమతిస్తారు.
  • 14 ఏళ్ల లోపు పిల్లలకు ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిసరి కాదు.

థర్మల్​ స్క్రీనింగ్​ పక్కా:

  • విమానాశ్రయంలోకి వచ్చే ప్రతి ప్రయాణికుడు.. స్క్రీనింగ్‌ జోన్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవాల్సిందే. అందుకు తగిన విధంగా విమానాశ్రయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలి.
  • థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసేందుకు ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్లు శిక్షిత సిబ్బందిని నియమించాలి.
  • విమానాశ్రయాల్లో ట్రాలీల వినియోగం నిషేధం. తప్పని సరి అయితేనే విమానాశ్రయ సిబ్బంది వాటిని ఇవ్వాల్సి ఉంటుంది.
  • టెర్మినల్‌లోకి ప్రవేశించే ముందే ప్రయాణికుల బ్యాగేజిని శానిటైజేషన్‌ చేయాలి.
  • ప్రవేశద్వారాల వద్ద ఎక్కువ మంది ప్రయాణికులు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా ప్రతి ప్రవేశ ద్వారం వద్ద తగిన మార్కింగ్‌ చేయాలి.
  • మ్యాట్‌లు, కార్పెట్లను సోడియం హైపోక్లోరైట్‌ సొల్యూషన్‌తో పూర్తి స్థాయిలో శుభ్రపరచాలి.

భౌతిక దూరంలో ప్రయాణికులు:

  • ప్రయాణికులకు అనువుగా ఉండేలా.. టికెట్ తనిఖీ ప్రదేశాలు, భద్రతా తనిఖీ, చెక్‌ఇన్‌ కౌంటర్లు వంటి వాటి చోట ప్రత్యేకంగా రూపొందించిన గాజు క్యాబిన్‌లు ఏర్పాటు చేయాలి లేదా అక్కడ ఉండే సిబ్బంది పారదర్శక ఫేస్‌ షీల్డ్‌ ధరించాలి.
  • విమానాశ్రయాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సీఐఎస్‌ఎఫ్‌ తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేయాలి.
  • ప్రయాణికులకు ప్రత్యేక సేవలు అందించే సిబ్బంది తప్పని సరిగా.. వ్యక్తిగత భద్రతా చర్యలు తీసుకోవాలి. వీల్‌చైర్లను ముందుగానే శానిటైజ్‌ చేయాలి.
  • భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు గుర్తు చేసేందుకుగాను.. ప్రకటనలు చేస్తూ ఉండాలి.
  • మూత్రశాలలు, ఎక్స్‌రే యంత్రాలు, బ్యాగేజి బెల్టుల వద్ద తగినంత సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  • ప్రయాణికులు అనుసరించాల్సిన అంశాలను నోటీస్​ బోర్డులపై అతికించాలి.
  • ప్రయాణికులు కుర్చునేందుకు అనువుగా భౌతిక దూరంతో కుర్చీలు ఏర్పాట్లు చేయాలి.

అందుబాటులో శానిటైజర్లు:

  • విమానయాన సంస్థలు కూడా చెక్‌ఇన్‌ కౌంటర్ల వద్ద రద్దీ లేకుండా చూసేందుకు తగిన సిబ్బందిని నియమించాలి.
  • ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది హాండ్‌ శానిటైజర్లు, వ్యక్తిగత భద్రత వ్యవస్థలను కలిగి ఉండాలి.
  • ఎయిర్‌పోర్టు మొత్తం ప్రతి ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తూ ఉండాలి.
  • ఎయిర్‌పోర్టు సిబ్బంది అంతర్గతంగా వినియోగించే వాహనాలను శానిటైజ్ చేసిన తర్వాతే వినియోగించాలి.
  • అవకాశం ఉన్నంత తక్కువగా సెంట్రలైజ్డ్‌ ఏసీ వినియోగించాలి.
  • ఎక్కడికక్కడ హ్యాండ్‌ శానిటైజర్లు ఏర్పాటు చేయాలి.
  • అనుమతించిన రసాయనాలనే వైరస్ నివారణకు వినియోగించాలి.
  • జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్న సిబ్బంది విధులకు దూరంగా ఉండాలి.
  • ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో పని చేసే సిబ్బంది ఎక్కువ మందిని ఒకచోట గుమిగూడకుండా నియంత్రించాలి.

పార్శిళ్లకే అనుమతి:

  • ఎయిర్‌పోర్టులలో ఆహార దుకాణాలతోపాటు అన్ని రకాల వ్యాపార సముదాయాలు తెరవచ్చు. కానీ హోటళ్లు, పుడ్‌ ప్లాజాల వద్ద ఆహారం తీసుకుని వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇవ్వాలి.
  • విమానం లోపలికి పంపే సమయంలో కూడా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఒకవేళ టెర్మినల్‌లో ఎవరైనా కరోనా సోకిన రోగిని గుర్తిస్తే.. వెంటనే ఆ ప్రాంతం అంతా వ్యాధినిరోధక రసాయనాలతో శుభ్రం చేయాలి. తగినంత జాగ్రత్తలు తీసుకుని రోగిని నిర్దేశిత ప్రాంతం నుంచి తరలించాలి.
  • గమ్యస్థానం చేరుకున్న తర్వాత ప్రయాణికులు విమానం నుంచి ఎలా దిగాలో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది తగిన సూచనలు ఇవ్వాలి.
  • వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలు, సలహాలను ఎయిర్‌పోర్టులో ఎక్కడికక్కడ పోస్టర్లు, డిస్‌ప్లే బోర్డుల రూపంలో ప్రదర్శించాలి.
  • ప్రయాణికులు, సిబ్బంది మధ్య సంభాషణ జరిగే అవకాశం ఉన్న ప్రతి చోట గ్లాస్‌ షీల్డ్‌ ఏర్పాటు చేయాలి.
  • బ్యాగేజి తీసుకునే చోట తప్పనిసరిగా భౌతిక దూరం పాటించే మార్కింగ్‌లు ఉండాలి.
  • విమానం నుంచి దించిన ప్రతి బ్యాగ్‌ను శానిటైజ్‌ చేసిన తరువాతే ప్రయాణికులు తీసుకునేలా ఏర్పాటు చేయాలి.

ఏఏఐ దేశవ్యాప్తంగా 100కుపైగా విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రధాన విమానాశ్రయాలను మాత్రం ప్రైవేటు కంపెనీలు నడుపుతున్నాయి.

ఇదీ చూడండి:చైనాకు షాక్​: భారత్​కు అమెరికా పూర్తి మద్దతు

Last Updated : May 21, 2020, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details