కరోనా ఆరోగ్యాన్నే కాదు.. ఆర్థికంగానూ దెబ్బతీస్తోంది. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తే.. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చయ్యాయో లెక్కే ఉండటం లేదు. ఏళ్లుగా సంపాదించిన మొత్తాన్ని ఈ మహమ్మారి రోజుల్లోనే ఖాళీ చేస్తోంది. ఇలాంటి పరిస్థితులో ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలు ఎంతో ప్రధానంగా మారిపోయాయి. దీంతోపాటు ప్రతి ఒక్కరూ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడమూ ముఖ్యం. బీమా పాలసీలు ఉంటే.. ఆసుపత్రి ఖర్చులను తట్టుకోవడంతోపాటు, జరగరానిది జరిగితే... కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఆర్థికంగా ఎంతో క్రమశిక్షణతో ఉన్నవారూ.. ఒక విషయాన్ని విస్మరిస్తుంటారు. చాలామంది ఒకటికి మించిన బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తుంటారు. స్థిరాస్తులు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. ఇలా అనేక పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తుంటారు. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలనూ తీసుకుంటారు. తనకూ.. తన కుటుంబానికీ ఆర్థికంగా భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ రాకూడదనే ఏర్పాటే ఇదంతా.. కానీ.. ఈ వివరాలను కుటుంబ సభ్యులకు చెప్పడం అంత అవసరమా అన్నట్లు భావిస్తుంటారు. ఇలాంటి ఆలోచనలను ఇప్పుడు మార్చుకోకతప్పదు.
ఎక్కడెక్కడ..
కష్టపడి సంపాదించిన మొత్తాన్ని.. ఎన్నో చోట్ల మదుపు చేస్తుంటాం.. అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయన్న సంగతి పెట్టిన వారికి తప్ప మూడో కంటికి తెలియకపోవడం ఎప్పుడూ ప్రమాదమే. కాబట్టి, ఈ లాక్‌డౌన్‌లో ఈ విషయాన్ని ఆలోచించండి. బ్యాంకు ఖాతా వివరాలు.. షేర్లు, మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులు, స్థిరాస్తి పత్రాలు.. ఇలా పెట్టుబడులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి.. వాటి ప్రస్తుత విలువ ఎంత తదితర వివరాలన్నీ నమోదు చేయండి.