తెలంగాణ

telangana

ETV Bharat / business

కొవిడ్​ మందుపై ఫార్మా కంపెనీల వినూత్న ప్రయోగం!

కరోనాను సమర్థంవంతంగా ఎదుర్కొంటున్న యాంటీ- వైరల్‌ ఔషధం 'మోల్నుపిరవిర్‌' పై క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు దేశంలోని 5 ప్రముఖ ఫార్మా సంస్థలు ఒకే తాటిమీదకు వచ్చాయి. ఇందులో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, సిప్లా, ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌, సన్‌ ఫార్మా ఇండస్ట్రీస్‌, టోరెంట్‌ ఫార్మా ఉన్నాయి.

molnupiravir clinical trials
మోల్నుపిరవిర్‌ క్లినికల్​ పరీక్షలు

By

Published : Jun 30, 2021, 7:03 AM IST

కొవిడ్‌-19 వ్యాధిని అదుపు చేయడంలో క్రియాశీలకంగా పనిచేస్తుందని భావిస్తున్న యాంటీ- వైరల్‌ ఔషధం 'మోల్నుపిరవిర్‌' పై క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు దేశంలోని 5 దిగ్గజ కంపెనీలు చేతులు కలిపాయి. ఇందులో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, సిప్లా, ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌, సన్‌ ఫార్మా ఇండస్ట్రీస్‌, టోరెంట్‌ ఫార్మా ఉన్నాయి. ఈ కంపెనీలు ఒక సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం మోల్నుపిరవిర్‌పై మనదేశంలో క్లినికల్‌ పరీక్షలను సంయుక్తంగా చేపడతాయి. భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)కి చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ పరీక్షలు నిర్వహిస్తారు. దీనికోసం ఆసుపత్రుల్లో అవుట్‌ పేషెంట్‌ విభాగానికి వచ్చే కొవిడ్‌-19 రోగులను గుర్తించి, వారిని ఈ పరీక్షల్లో భాగస్వాములను చేస్తారని తెలుస్తోంది. దాదాపు 1200 మంది బాధితులను ఎంపిక చేసి వచ్చే 3 నెలల వ్యవధిలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. పరీక్షలు ముగిసిన తర్వాత, ఈ కంపెనీలన్నీ ఆ సమాచారాన్ని డీసీజీఐకి అందించి మోల్నుపిరవిర్‌ ఉత్పత్తి- విక్రయాల నిమిత్తం విడివిడిగా అనుమతి పొందాల్సి ఉంటుంది.

ఇదే తొలిసారి

ఏదైనా ఒక ఔషధానికి సంబంధించిన క్లినికల్‌ పరీక్షల నిర్వహిణలో ఔషధ కంపెనీలు ఇలా ఉమ్మడిగా వ్యవహరించడం మనదేశంలో ఇదే తొలిసారి. దీనివల్ల ఖర్చు తగ్గడంతో పాటు, సమయం కూడా ఆదా అవుతుంది. ఈ ఔషధాన్ని విస్తృతంగా, త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఏర్పడుతుంది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఔషధ కంపెనీలు విడివిడిగా క్లినికల్‌ పరీక్షలు నిర్వహించి, అనుమతులు తీసుకుంటాయి. కానీ కొవిడ్‌ మహమ్మారి ప్రత్యేక పరిస్థితుల్లో కలిసి పనిచేయడానికి కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ ప్రయోగం విజయవంతం అయితే మున్ముందు మరికొన్ని ఔషధాల విషయంలో ఇలా కలిసి పనిచేసే అవకాశం ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

అమెరికాలో మూడో దశ పరీక్షలు

మోల్నుపిరవిర్‌ ఔషధం, కొవిడ్‌-19 బాధితులపై ఏమేరకు పనిచేస్తుందనే విషయంలో అమెరికాకు చెందిన అగ్రశ్రేణి ఔషధ కంపెనీ ఎంఎస్‌డీ, రిడ్జ్‌బ్యాక్‌ బయోథెరప్యూటిక్స్‌ అనే కంపెనీతో కలిసి పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ ఔషధానికి అమెరికాలో 'అత్యవసర అనుమతి' కోసం ఎంఎస్‌డీ ఫార్మా దరఖాస్తు చేసే అవకాశం ఉంది. అదే సమయంలో ఇతర దేశాల్లోనూ అనుమతి తీసుకుని, ఆయా దేశాల్లోని ఫార్మా కంపెనీలతో నాన్‌-ఎక్స్‌క్లూజివ్‌ పద్ధతిలో ఈ ఔషధం ఉత్పత్తి- విక్రయాలను లైసెన్సింగ్‌ ఒప్పందాలు కుదుర్చుకోడానికి ఎంఎస్‌డీ ఫార్మా సిద్ధపడుతోంది. దేశీయ కంపెనీలతో ఇప్పటికే ఇటువంటి ఒప్పందాలను సంస్థ కుదుర్చుకున్న విషయం గమనార్హం.

ఇప్పటికే నాట్కో.. మరికొన్ని కంపెనీలు

మనదేశంలో మోల్నుపిరవిర్‌ ఔషధంపై నాట్కో ఫార్మా, మరికొన్ని ఇతర కంపెనీలు క్లినికల్‌ పరీక్షలు మొదలు పెట్టాయి. హైదరాబాద్‌, విశాఖపట్నంతో సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కొన్ని ఆసుపత్రులను ఎంపిక చేసి, అక్కడ క్లినికల్‌ పరీక్షలను నాట్కో ఫార్మా నిర్వహిస్తోంది. మరికొన్ని దేశీయ ఫార్మా కంపెనీలు కూడా పరీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఔషధ తయారీ పరిజ్ఞానాన్ని పొందేందుకు ఐఐసీటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ) తో మరికొన్ని ఫార్మా కంపెనీలు సాంకేతిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. కొవిడ్‌-19 ను కట్టడి చేయడంలో ఈ మందు క్రియాశీలకంగా పనిచేస్తుందనే నమ్మకం కలగటంతో పలు ఫార్మా కంపెనీలు దీనిపై ఆసక్తి చూపిస్తున్నాయి.

ఇదీ చూడండి:కారు కొనకుండానే ఓనరు అవ్వండిలా...

ABOUT THE AUTHOR

...view details