గత ఏడాది కాలంలో కరోనా మహమ్మారి కారణంగా 23 కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి జారుకున్నారని అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం రేటు 15 శాతం, పట్టణ ప్రాంతాల్లో 20 శాతం పెరిగిందని పేర్కొన్నారు. 'స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2021 - వన్ ఇయర్ ఆఫ్ కొవిడ్ 19' పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించారు.
"మహమ్మారి కారణంగా 23 కోట్ల మంది జాతీయ కనీస వేతన పరిమితి పరిధి కన్నా తక్కువ వేతనాలు అందుకుంటున్నారు. ఏప్రిల్, మే నెలల్లో 20 శాతం మంది పేదలు తమ ఆదాయాన్ని కోల్పోయారు. ఇందుకు భిన్నంగా సంపన్నులు.. మహమ్మారి ముందు కన్నా తక్కువ నష్టపోయారు."
-అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం నివేదిక
ఉపాధికి గండి..
గతేడాది ఏప్రిల్-మే మధ్య విధించిన లాక్డౌన్ కారణంగా 10 కోట్లమంది ఉపాధి కోల్పోయారని నివేదిక పేర్కొంది. జూన్ నాటికి పలువురికి ఉపాధి లభించినా, ఏడాది చివరి నాటికి 1.5 కోట్ల మంది ఇంకా నిరుద్యోగులుగానే ఉన్నారని తెలిపింది. నెలకు సగటు కుటుంబ ఆదాయం జనవరిలో రూ.5,989 ఉండగా.. అక్టోబరు నాటికి రూ.4,979కు చేరిందని వెల్లడించింది. 'కరోనా కేసులు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ ఉపాధి నష్టం జరిగింది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్, దిల్లీ రాష్ట్రాల్లో ఈ విషయంలో తీవ్రంగా ప్రభావితమయ్యాయి' అని పేర్కొంది.