దేశ జీడీపీ వృద్ధిపై కరోనా ప్రభావం సహా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై 15వ ఆర్థిక సంఘం సలహా మండలి ఈ నెల 23, 24వ తేదీల్లో భేటీ కానుంది. ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ఎన్కే సింగ్ నేతృత్వంలో దూరదృశ్య సమీక్ష ద్వారా జరగనున్న ఈ సమావేశంలో ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపులపై కూడా చర్చించనుంది.
ఆర్థిక అనిశ్చితిపైనా
2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు, ఆర్థిక రంగంలో రాబోయే రోజుల్లో నెలకొనబోయే అనిశ్చితిని కూడా 15వ ఆర్థిక సంఘం సలహా మండలి ఎజెండాగా నిర్ణయించింది. కరోనా ప్రభావం నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సహా పలు సంస్థలు భారతదేశ జీడీపీ వృద్ధి రేటు ఒకటి నుంచి 3శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేసిన నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం సలహా మండలి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఇదీ చదవండి:భారత్కు 5 లక్షల టెస్టింగ్ కిట్లు వస్తున్నాయ్..