యూపీపై కాంగ్రెస్ దృష్టి... సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో... ఉత్తరప్రదేశ్‌లోని రాజకీయాలపై దృష్టి సారించింది కాంగ్రెస్. ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించిన అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవలే ప్రియాంకగాంధీ, సింధియాలను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. తాజాగా పార్లమెంటు స్థానాల బాధ్యతల్ని అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
లోక్‌సభలో అత్యధికంగా 80 ఎంపీ స్థానాలు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నాయి. ఇందులో రాహుల్ సోదరి ప్రియాంకగాంధీకి 41, జ్యోతిరాదిత్య సింధియాకు 39 స్థానాల బాధ్యతలు కేటాయించారు. ప్రస్తుతం ప్రియాంక తూర్పు ఉత్తర్‌ప్రదేశ్, సిందియా పశ్చిమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
రాజధాని నగరమైన లఖ్‌నవూతో పాటు అమేఠీ, రాయ్‌బరేలీ, సుల్తాన్‌పుర్, గోరఖ్‌పుర్, వారణాసీ, ఫూల్పుర్, అలహాబాద్, కుశీనగర్ల బాధ్యతలు ప్రియాంక గాందీ చూసుకోనున్నారు.
సహారన్‌పుర్, కైరానా, ముజఫర్‌నగర్, మొరాదాబాద్, ఘజియాబాద్, ఫిలిభిత్, కాన్పుర్, ఫరూఖాబాద్లు సింధియాకు కేటాయించారు. సోమవారం రోజు ప్రియాంక, సింధియాలతో పాటు రాహుల్‌గాంధీ ఇక్కడ భారీ రోడ్‌షో నిర్వహించారు. ర్యాలీ విజయవంతం కావటంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది.