ఎన్నికల ప్రచార పోస్టర్లలో, ఫ్లెక్సీలలో భార్యభర్తల ఇద్దరి ఫొటోలు ఉంటే అది మహిళకు రిజర్వు చేసిన స్థానమని అర్థం. మీ ఊరిలో పోటీలో ఉన్నది ఎవరని ప్రశ్నిస్తే... అభ్యర్థి అయిన భార్య పేరు ఎవరు చెప్పరు... ఆమె భర్త పేరే చెబుతారు. ఇలా ఉంది మహిళా అభ్యర్థులు బరిలో ఉన్న చోట.
'పదవి ఆమెది... పెత్తనం ఆయనది' - women contestant
పదవి ఆమెదే... కానీ పెత్తనం అతనిది. ప్రతి మగాడి విజయం వెనుక మహిళ ఉంటుందని తెలుగు సామెత. ప్రతి అతివ పదవి వెనుక మాత్రం అతడు ఉంటాడు. విధులు నిర్వర్తిస్తాడు. అధికారాలు చలాయిస్తాడు. ఆమె మాత్రం అదే వంటింట్లోనే.
మహిళలు పోటీ చేసి గెలిస్తే... విధులు నిర్వర్తించేది వారి భర్తలే అంటున్నారు ఓటర్లు. సర్పంచ్‌లుగా మహిళలు ఎన్నికైనా... పంచాయతీ పాలక వర్గ సమావేశాలకు మాత్రం వాళ్ల భర్తలే హాజరైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సంతకం కూడా అతనే చేస్తాడు అని చెబుతున్నారు.
స్థానిక సంస్థల్లో ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే అవి ఈ విధంగా దుర్వినియోగం అవుతున్నాయని అంటున్నారు ప్రజాస్వామికవాదులు. రిజర్వేషన్లు కల్పించినా... మహిళలు పేరుకు మాత్రమే పదవుల్లో ఉంటున్నా... వాళ్ల భర్తలదే పెత్తనం.